నేటి సాక్షి గజ్వేల్ :గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రజ్ఞాపూర్‌కు చెందిన యువకుడు సాహిత్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మోటార్ రహదారి లడక్‌లోని ఉమ్లింగ్ లా పాస్ (19,024 అడుగులు / 5,798 మీటర్లు)ను 100 సీసీ హిరో ప్యాషన్ ప్రో బైక్‌పై చేరుకొని గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించి తెలంగాణకు గర్వకారణంగా నిలిచాడు.ప్రజ్ఞాపూర్‌కు చెందిన శోభారాణి పురాణం – శ్రీనివాస్ దంపతుల కుమారుడైన సాహిత్, ఈ సాహసయాత్రను ఏప్రిల్ 12న గజ్వేల్ నుంచి ప్రారంభించాడు. దాదాపు 16 రోజుల పాటు నిరంతర ప్రయాణం కొనసాగించి, అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ చివరకు ఏప్రిల్ 28న ఉమ్లింగ్ లా శిఖరాన్ని చేరుకొని చరిత్ర సృష్టించాడు.ఉమ్లింగ్ లా ప్రాంతం తక్కువ ఆక్సిజన్ స్థాయులు, తీవ్ర చలి, బలమైన గాలులు, ప్రమాదకర మలుపులు, చెదిరిపోయిన రహదారులు వంటి సవాళ్లకు ప్రసిద్ధి. ఇలాంటి పరిస్థితుల్లోనూ ధైర్యంగా ముందుకు సాగి సాహిత్ ఈ అరుదైన ఘనతను సాధించాడు.ఈ విజయంతో గజ్వేల్ ప్రజ్ఞాపూర్‌తో పాటు పరిసర గ్రామాల ప్రజలు, స్నేహితులు, బంధువులు సాహిత్‌ను అభినందిస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ యువతకు ఇది ప్రేరణగా నిలుస్తుందని పలువురు పేర్కొన్నారు.సాహిత్ సాధించిన ఈ ఘనత గజ్వేల్ ప్రాంతానికే కాక తెలంగాణ రాష్ట్రానికి కూడా గర్వకారణంగా నిలిచిందని స్థానికులు కొనియాడుతున్నారు.





