నేటి సాక్షి: కుల, మత బేధాలు తారతమ్యాలు లేకుండా ప్రతి పండుగను ప్రజలందరూ కలిసి మెలిసి జరుపుకోవాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు. గురువారం క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని జిల్లాలోని చెన్నూర్ మండల కేంద్రంలో గల ఐ ఈ ఎం చర్చ్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనలకు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ ప్రతి పండుగను ఎలాంటి తారతమ్యాలు లేకుండా ప్రజలందరూ సామరస్యంతో సంతోషంగా జరుపుకోవాలని తెలిపారు. మైనారిటీల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, క్రిస్మస్ పండుగ ప్రేమ, త్యాగానికి ప్రతీక అని, ప్రతి చర్చ్ కు పైయిటింగ్, విద్యుత్ దీపాలంకరణ కొరకు 30 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. అర్హులైన మైనారిటీ విద్యార్థులు విదేశీ విద్యను అభ్యసించేందుకు 20 లక్షల రూపాయలతో పాటు ఒక ప్రయాణం ఉచితంగా అందిస్తుందని, విద్యార్థులకు ఉపకార వేతనాలు, అడ్మిషన్ రుసుములు వంటి అనేక సౌకర్యాలు కల్పిస్తుందని తెలిపారు. మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా మహిళలకు అందిస్తున్న కుట్టు మిషన్లను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని తెలిపారు. కుట్టు మిషన్ల కొరకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు జనవరి 1వ తేదీ నుండి కుట్టు మిషన్ల పంపిణీకి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా పేదలకు సహాయం చేయాలని, వారికి చేయూత అందించి అభివృద్ధిలోకి తీసుకరావాలన్నారు అనంతరం శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి/ షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరై 29 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ చెన్నూర్ నగర అభివృద్ధి కొరకు 18 కోట్ల రూపాయలు మంజూరు చేసి పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. టి ఎమ్ ఐ డి సి నుండి అభివృద్ధి కొరకు 100 కోట్ల రూపాయలు మంజూరు చేసే అవకాశం ఉందని, చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. జైపూర్, భీమారం మండలాలలో అంబేద్కర్ భవన్, 25 లక్షల రూపాయలతో జగ్జీవన్ రామ్ భవన్, 25 లక్షల రూపాయలతో షెడ్యూల్డ్ తెగల కమ్యూనిటీ హాల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. చెన్నూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియాను అరికట్టడం జరిగిందని, అధికారులు ఎవరైనా అక్రమ ఇసుక రవాణాకు సహకరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిరుపేదల కోసం ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులైన పేదలకు ఇండ్లు నిర్మించేందుకు కాంట్రాక్ట్ ఇచ్చేందుకు ఆలోచన చేస్తున్నామని తెలిపారు. సాండ్ బజార్ ద్వారా 2 వేల రూపాయలకు ఇసుకను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్య, వైద్య రంగాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థులకు అవసరమైన సకల సదుపాయాలు కల్పించి నాణ్యమైన విద్యను అందించడంతో పాటు మధ్యాహ్న భోజనంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించి విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం జరుగుతుందని తెలిపారు. చెన్నూరు మండల కేంద్రంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టడం జరిగిందని, సామాజిక ఆరోగ్య కేంద్రం, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. వచ్చే వేసవికాలంలో చెన్నూరు నియోజకవర్గంలో నీటి సమస్య లేకుండా నిరంతరం త్రాగునీటిని అందించేందుకు ముందస్తు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జిల్లాలో చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇప్పటివరకు 6 వేల ఇండ్లు బేస్మెంట్, 2 వేల 300 ఇండ్లు రూఫ్ లెవెల్ వరకు పూర్తయ్యాయని, స్లాబ్ లెవెల్ వరకు పూర్తి చేసిన లబ్ధిదారుల ఖాతాలో 4 లక్షల రూపాయలు జమ చేయడం జరిగిందని తెలిపారు. 11 ఇండ్లు పూర్తి చేయబడి లబ్ధిదారులకు 5 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, ఇండ్లు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. భూమి కలిగి ఉండి అర్హత కలిగిన వారికి ఇందిరమ్మ ఇండ్ల పథకం వర్తించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజా అవసరాలు తీర్చేందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

