’* చెంచుల చరిత్రను వారి మధ్యనే ఆవిష్కరించడం గొప్ప పరిణామం* కొండమల్లు పుస్తకావిష్కరణ సభలో మాజీ మంత్రి హరీష్‌రావుచెంచుల జీవన విధానాలను ప్రతిబింబించేలా కొండమల్లు నవలను వర్ధెల్లి వెంకటేశ్వర్లు తీర్చిదిద్దారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీష్‌రావు అన్నారు. గచ్చిబౌలిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నిర్వహించిన కొండమల్లు పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ… సాధారణంగా నవలలు రాజుల యుద్ధాల గురించి ఉంటాయి కానీ గిరిజనుల సామాజిక జీవన విధానాల నేపథ్యంలో రావడం గొప్ప విషయమన్నారు. వర్ధెల్లి వెంకటేశ్వర్లు రచించిన మూడు పుస్తకాలను తానే ఆవిష్కరించడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. కొండమల్లు పుస్తకం ద్వారా చెంచుల చరిత్ర, వారి సంస్కృతి చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా రాశారని కొనియాడారు. వెంకటేశ్వర్లు రాసిన ‘మరణం అంచున’ పుస్తకం ఆవిష్కరణ కూడా తన చేతుల మీదుగానే జరిగిందని గుర్తు చేశారు. అప్పుడు చెంచుల భూములపై హక్కులు కల్పించేలా సహకరించాలని కోరగా అప్పటి సీఎం కేసీఆర్ సహకారంతో ఆ ప్రాంతాంనికి చెందిన 1600 ఎకరాల చెంచుల భూములకు పోడు పట్టాలు ఇచ్చామని గుర్తుచేశారు. వెంకటేశ్వర్లు తన పుస్తకాలతో చెంచుల అస్థిత్వాన్ని కాపాడేందుకు తన వంతు సహాయం, కృషి చేస్తున్నారని అభినందించారు. వెంకటేశ్వర్లు మరో పుస్తకం ‘పిట్ట వాలిన చెట్టు’ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రతిబింబించేలా ఉందని అన్నారు. మిషన్ కాకతీయ, చెక్‌డ్యామ్‌లు, రిజర్వాయర్ల నిర్మాణం ద్వారా ప్రత్యేక రాష్ట్రంలో మన నీళ్లు మనకు వాపస్ వచ్చినట్లే.. పచ్చదనం పెరగడంతో పక్షులు కూడా చెట్లపైకి వాపస్ వచ్చినట్లుగా పుసక్త రచన చేయడం గొప్ప విషయమని తెలిపారు. కొండమల్లు పుస్తకానికి ముందుమాట రాసిన అట్టాడ అప్పలనాయుడు వ్యాఖ్యలు తనకు చాలా బాగా నచ్చాయని హరీష్ రావు అన్నారు. రచయితను పొగటమే కాకుండా పుస్తకంలో సమాజానికి ఉపయోగపడే అంశాలను ఎలా పొందుపరచాలో ఆయన చేసిన సూచనలు అభినందనీయమన్నారు. ఈకార్యక్రమంలో కవి, రచయిత జూలూరి గౌరిశంకర్, సీనియర్ ఎడిటర్ వర్ధెల్లి మురళి, తెలంగాణ టుడే ఎడిటర్ శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, టీయూడబ్ల్యూజే జనరల్ సెక్రెటరీ మారుతీసాగర్ తదితరులు పాల్గొన్నారు. * ఆదివాసీల జీవితాల ఆవిష్కరణే కొండమల్లు: గోరటి వెంకన్న, ఎమ్మెల్సీ, ప్రజాకవిసాధారణంగా నాకు నవలలు అంత తొందరగా నచ్చవు. కానీ నాకు నచ్చిన అతికొద్ది నవలల్లో కొండమల్లు ఒకటి. ఆదివాసీల జీవితాన్ని పుసక్తాల్లో పొందుపరచడం అంటే మామూలు విషయం కాదు. ఒక నవలలో ఎలాంటి విసుగు, వివాదానికి తావివ్వకుండా చెంచు జాతికి చెందిన వ్యక్తిని హీరోను చేయడం సాధారణ విషయం కాదు. ఎలాంటి కల్మషం లేనివారు చెంచులు. వారి బతుకులు అంతరించిపోకుండా ప్రపంచానికి తెలియజేసేలా వెంకటేశ్వర్లు చేస్తున్న కృషి అత్యంత అభినందనీయం. ఆదివాసీలను వారి బతుకులు వారిని బతకనిద్దాం. అడవిలో బతుకుతున్న నిజమైన ఆధ్యాత్మికతత్వం కలిగిన వారు చెంచులు. అలాంటి వారి అస్థిత్వాన్ని కాపాడేందుకు వర్ధెల్లి వెంకటేశ్వర్లు చేస్తున్న కృషి విశేషమైనది. * కొండమల్లుకు ముందుమాట రాయడం నా అదృష్టం: బండి నారాయణస్వామి, ప్రముఖ రచయితకొండమల్లు పుస్తకానికి ముందుమాట రాయడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఇంత మంది పుస్తకం రాయడం పట్ల వర్ధెల్లి వెంకటేశ్వర్లును అభినందిస్తున్నా. ఏదైనా పుస్తకానికి ముందుమాట రాయాలంటే కొంత వరకు చదివితే సరిపోతుంది. కానీ ఈ పుస్తకం పూర్తిగా చదివేలా వెంకటేశ్వర్లు కథలో లీనమై రచించారు. 12వ శతాబ్ధం కథను వర్తమానానికి సరిపోలేలా ఈ నవలను తీర్చిదిద్దారు. ఈ నవల ప్రస్తుత రాయలసీమ ప్రజల జీవన పరిస్థితులను ప్రతిబింబించేలా ఉంది. త్వరలోనే వర్ధెల్లి వెంకటేశ్వర్లు నుంచి కాకతీయుల చరిత్రకు సంబంధించిన నవల రాబోతున్నది. ప్రస్తుతమున్న రచయితల్లో అలాంటి కథలకు ప్రాణం పోయగలిగే సమర్థుడు వెంకటేశ్వర్లు ఒక్కరే సమర్థుడు. * ఆదివాసీల చరిత్రను తెలిపిన మొదటి నవల: అట్టాడ అప్పలనాయుడు, ప్రముఖ రచయితఆదివాసీల చరిత్రను తెలిపిన మొట్టమొదటి నవల కొండమల్లు. ఈ పుస్తకంలో 12వ శతాబ్ధపు నాటి చెంచుల జీవన విధానం, వారి ఆహారపు అలవాట్లు, పోరాట పటిమ, ధైర్య సాహసాలను కండ్లకు కట్టినట్లు దృశ్య కావ్యంలా రూపొందించారు. అడవి పరిమళాల స్వచ్ఛదనాన్ని తెలియజెప్పారు. కారు కోడిని వేటాడే క్రమంలో బయ్యన్న అనే చెంచు వ్యక్తి తన పూర్వ జీవనం, ప్రస్తుత విషయాల మేళవింపుతో నవలకు పూర్తి న్యాయం చేశారు. పల్నాటి బ్రహ్మనాయుడు లాంటి రాజుల కాలంలో ఒక చెంచు ఆదివాసీని హీరోగా చేయడం గొప్ప సాహసం. ఇలాంటి నవలలు వెంకటేశ్వర్లు నుంచి మరెన్నో రావాలని కోరతున్నా. * సంక్లిష్ట విషయాన్ని నవలగా తీర్చిదిద్దడం అభినందనీయం: కే శ్రీనివాస్, సీనియర్ ఎడిటర్‌తెలుగు సాహిత్యానికి వర్ధెల్లి వెంకటేశ్వర్లు రూపంలో కొత్త నవలాకారుడు వచ్చారు. తెలంగాణ ప్రాంతానికి నవలాకారుల కొరత ఉండేది. ఇప్పుడు ఆ కొరత తీరిందని భావిస్తున్నా. సంక్లిష్టమైన విషయాన్ని సరళరూపంలో నవలగా రాయడం చాలా గొప్పవిషయం. అందులో వర్ధెల్లి వెంకటేశ్వర్లు సఫలీకృతులయ్యారు. ఆంధ్రా ప్రాంత చరిత్రను తెలంగాణ మాండలికంలో రాసిన గొప్ప రచయిత వెంకటేశ్వర్లు. కొండమల్లు రూపంలో చెంచుల జీవితాలు సాహిత్యంలోకి రావడం గొప్ప పరిణామం. ఈ పుస్తకం గొప్ప చరిత్రతో పాటు విజ్ఞానాన్ని ఇస్తుందని భావిస్తున్నా. * చెంచుల చరిత్రను వెలికి తీసిన వెంకటేశ్వర్లు: అల్లం నారాయణ, ప్రెస్ అకాడమీ మాజీ ఛైర్మన్‌చెంచుల జీవన విధానం, వారి బతుకులను ప్రపంచానికి తెలియజేయడంలో వర్ధెల్లి వెంకటేశ్వర్లు గొప్పమనసు చాటుకున్నారు. కొండమల్లు పుస్తకంతో ఆయన 12వ శతాబ్ధంలోకి వెళ్లి, అందులో లీనమైపోయారు. అప్పటి పరిస్థితులను అనుభవించినట్లుగా పుస్తకంలో పొందుపరిచారు. ఆదివాసీల జీవితాల్లో చోటుచేసుకుంటున్న ప్రస్తుత పరిణామాలు సమాజానికి తెలియాల్సిన అవసరం ఉంది. ఆదిశగా వర్ధెల్లి వెంకటేశ్వర్లు కృషి చేయడం గొప్ప పరిణామం. * కొండమల్లుతో బయటకొచ్చిన కొత్త చరిత్ర: ఘంటా చక్రపాణి, వైస్ ఛాన్సులర్, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కొండమల్లు వంటి పుస్తకాన్ని రాయడం వల్ల వర్ధెల్లి వెంకటేశ్వర్లుపై నాకు గౌరవం పెరిగింది. పుస్తక రచనలో ఆయన ఎంచుకున్న పద్ధతి నాకు బాగా నచ్చింది. చరిత్రకారులు తమకు నచ్చిన వాటినే చరిత్రలో పొందు పరిచారు. కానీ ఈ పుస్తకంతో కొత్త చరిత్ర బయటకు వస్తుందని భావిస్తున్నా. ప్రస్తుత రచయితలు కనుమరుగైన చరిత్రను బయటకు తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

