నేటి సాక్షి, ఎండపల్లి:* వెల్గటూర్ మండలం రాంనూర్ గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రంలో రైతులు సోమవారం సమావేశమై ధాన్యం కొనుగోళ్లలో కొనసాగుతున్న జాప్యంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా సాగిన వరి కోతలు ప్రస్తుతం పూర్తయ్యాయని, రైతులు తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించి కుప్పలు తెప్పలుగా పోసి కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నప్పటికీ ఇప్పటివరకు రెండు లారీల ధాన్యం కూడా కొనుగోలు చేయకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రం వద్ద రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. వర్షాలు పడితే ధాన్యం దెబ్బతినే ప్రమాదం ఉన్నా కొనుగోలు ప్రక్రియలో వేగం లేకపోవడం రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోందన్నారు. రైతుల సమస్యలను పక్కనపెట్టి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.తక్షణమే ధాన్యం సేకరణ ప్రారంభించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. రేపటిలోగా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి కొనుగోళ్లు ప్రారంభించని పక్షంలో మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపట్టి నిరసన తెలియజేస్తామని రైతులు హెచ్చరించారు. రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని సమావేశంలో స్పష్టం చేశారు.





