నేటి సాక్షి గజ్వేల్….ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ ధ్యేయమని తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ (సెకండరీ హెల్త్ కమిషనర్) డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు. అలాగే మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని కూడా పరిశీలించారు.ఈ సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణం, ఓపీ విభాగం, ఇన్‌పేషెంట్ వార్డులు, ప్రసూతి విభాగం, అత్యవసర విభాగం, ల్యాబ్, ఫార్మసీ విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆసుపత్రిలో పరిశుభ్రత, శుద్ధి నిర్వహణ, బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణను మరింత పటిష్టంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.రోగులు ఆసుపత్రికి వచ్చినప్పటి నుంచి చికిత్స పొందే వరకు ప్రతి దశలో సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని, సిబ్బంది మర్యాదపూర్వకంగా స్పందించాలని ఆయన ఆదేశించారు. ఆసుపత్రి ప్రాంగణంలో చెత్త పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలని, వ్యర్థ పదార్థాలను రంగుల బిన్‌లలో వేరువేరుగా వర్గీకరించి నిబంధనల ప్రకారం సురక్షితంగా తరలించాలని తెలిపారు.అలాగే ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న సేవల నాణ్యత, మందుల లభ్యత, వైద్య పరికరాల వినియోగం, శుద్ధి చేసిన తాగునీరు, పరిశుభ్రత, సిబ్బంది పనితీరు సంతృప్తికరంగా ఉందని డాక్టర్ అజయ్ కుమార్ అభినందించారు. గజ్వేల్ ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి కార్పొరేట్ స్థాయిలో సేవలు అందిస్తోందని పేర్కొంటూ ప్రజలందరూ ఈ ఆసుపత్రి సేవలను వినియోగించుకొని నాణ్యమైన వైద్యం పొందాలని సూచించారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో సేవలు మెరుగుపడితే ప్రజల్లో విశ్వాసం మరింత పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో గజ్వేల్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అన్నపూర్ణ, ఆర్‌ఎంఓలు డాక్టర్ రాజేష్, డాక్టర్ ప్రణీతి, సీనియర్ అసిస్టెంట్ సతీష్, నర్సింగ్ సూపరింటెండెంట్ సువర్ణ, ఫార్మసీ ఆఫీసర్లు విమల, ఎఫ్సిబా, శ్రీనివాసచారి, మోహన్ బండారి, శానిటరీ ఇన్స్పెక్టర్ లక్ష్మి, ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్సింగ్ ఆఫీసర్ మెహరాజ్ భాను, హెడ్ నర్సులు జగదాంబ, ఉమామహేశ్వరి, వకుళాదేవి, నిర్మల, పుష్ప, హెల్త్ అసిస్టెంట్ వాసుదేవ్, టెక్నీషియన్ రాజు, ఆరోగ్యశ్రీ ఇన్‌చార్జి సురేందర్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.




