Friday, February 13, 2026

ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం – పోలీస్ పహారా మధ్య యూరియా పంపిణీ!యూరియా కోసం క్యూ లైన్లలో అన్నదాతలు… అధికారంలో ఉన్నవాళ్లు ఏం చేస్తున్నారు?1150 బస్తాలకే రైతుల – కాంగ్రెస్ పాలనలో సాగుకు శాపంఒక యూరియా కోసమే రైతుల హరిగోశ – వ్యవసాయంపై నిర్లక్ష్యం పరాకాష్ట

నేటి సాక్షి , మహబూబాబాద్(భూక్యా రవి నాయక్) డిసెంబర్ 24 నర్సింహులపేట మండల కేంద్రంలో చోటుచేసుకున్న యూరియా పంపిణీ దృశ్యాలు ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాన్ని బహిరంగంగా చాటిచెప్పాయి. రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ పనులు ఊపందుకున్న ఈ కీలక సమయంలో రైతులకు అవసరమైన యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల వ్యాప్తంగా సాగు పనులు జోరందుకోవడంతో యూరియా అవసరం గణనీయంగా పెరిగింది. కానీ అవసరానికి తగినంత సరఫరా లేకపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. యూరియా కోసం తెల్లవారుజామునే క్యూ లైన్లలో నిలబడిన రైతులకు గంటల తరబడి ఎదురుచూపులే మిగిలాయి.ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయానికి కేవలం 1150 యూరియా బస్తాలు మాత్రమే వచ్చాయని సమాచారం వెలువడడంతో మండలంలోని వివిధ గ్రామాల నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఒక్క ఊరిలో కోసమే రైతులు కుటుంబ సభ్యులతో సహా క్యూ లైన్లలో నిలబడాల్సిన దుస్థితి నెలకొంది. కొందరు రైతులు పస్తులు ఉండి గంటల తరబడి ఎదురుచూస్తున్నా యూరియా దొరకని పరిస్థితి ఏర్పడింది.రైతుల సంఖ్య భారీగా పెరగడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. శాంతిభద్రతల పేరుతో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీస్ పహారా మధ్య యూరియా పంపిణీ జరగడం ప్రజాస్వామ్య దేశంలో రైతుల స్థితిని ప్రతిబింబిస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. యూరియా పంపిణీ ఇంకెన్ని రోజులు జరుగుతుందో, సరఫరా ఎప్పుడు మెరుగుపడుతుందో చెప్పే అధికారులే లేకపోవడంతో రైతులు అయోమయంలో పడ్డారు.ప్రస్తుతం ఒక్క రైతుకు ఒకటి లేదా రెండు బస్తాల చొప్పున మాత్రమే యూరియా పంపిణీ చేయడం వల్ల సాగుకు అది సరిపోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంట వేయాల్సిన సమయం గడుస్తుండగా, యూరియా అందకపోవడంతో దిగుబడులపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.ఎన్నికల సమయంలో రైతులకు పెద్ద పెద్ద హామీలు ఇచ్చిన పాలకులు, అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలను పూర్తిగా విస్మరించారని రైతులు ఆరోపిస్తున్నారు. యూరియా వంటి మౌలిక అవసరానికే పోలీస్ పహారా అవసరం రావడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని స్థానికులు విమర్శిస్తున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యూరియా సరఫరాను తక్షణమే పెంచాలని, రైతులను ఈ అవమానకర పరిస్థితి నుంచి బయటపడేయాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో రైతుల ఆగ్రహం మరింత పెరిగే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News