నేటి సాక్షి వికారాబాద్:జిల్లా పోలీస్ కార్యాలయంలో (డీపీవో) పనిచేస్తున్న వివిధ విభాగాల పోలీస్ అధికారులు సిబ్బందితో జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర ప్రత్యేకంగా సమావేశమై ‘దిశానిర్దేశం’ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని ప్రతి విభాగం పనితీరును, పెండింగ్లో ఉన్న దస్త్రాలను (ఫైల్స్) ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సిబ్బంది విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న సవాళ్లను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి సంబంధించి పలు కీలక సూచనలు సలహాలు అందించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖలో క్రమశిక్షణ అనేది అత్యంత ప్రధానమని, ప్రతి అధికారి సమయపాలన పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. కార్యాలయానికి వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించి, వారి సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విభాగాల మధ్య పరస్పర సమన్వయం ఉన్నప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయని, సహోద్యోగులందరూ ఒకే కుటుంబంలా కలిసి పనిచేయాలని సూచించారు.ముఖ్యంగా, నిరంతరం విధుల్లో ఉండే సిబ్బంది మానసిక ఒత్తిడికి గురికాకుండా ఉండటానికి పనిని ప్రణాళికాబద్ధంగా విభజించుకోవాలని ఎస్పీ పేర్కొన్నారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ, విధుల్లో పారదర్శకతను పెంచాలని పిలుపునిచ్చారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా, ఉత్సాహవంతమైన వాతావరణంలో పనిచేసినప్పుడే ప్రజలకు మెరుగైన సేవలు అందించగలమని ఎస్పి ఈ సందర్భంగా వివరించారు. అనంతరం ఎస్పీ జిల్లా పోలీస్ కార్యలయం లోని వివిధ విభగాలను పరిశీలించడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో జిల్లా అదనపు ఎస్పీ బి.రాములు నాయక్ , డిసిఆర్బి డిఎస్పి జానయ్య , ఏఓ ఖాజా మోహినోద్దీన్ ,ఆర్ఐ డేవిడ్ విజయ్ కుమార్ ,డిపిఓ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది.





