- బలోపేతానికి కృషి చేయండి
- అత్యుత్తమ సేవలందించండి
- చిన్నారులు, గర్భిణుల ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వండి
- తప్పులు లేకుండా ఇంటింటా సర్వే నిర్వహించండి
- సీడీపీఓలు, సూపర్వైజర్లు బాధ్యతగా పని చేయండి
- నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు
- తరచూ కేంద్రాలను తనిఖీ చేయండి
- పనితీరు బాగుంటేనే పాఠశాలలకు మంచి పేరు
- ఏ అవసరం ఉన్న అడగండి.. నిధులు మంజూరు చేస్తా..
- కలెక్టర్ పమేలా సత్పతి
- ప్రీస్కూల్పై ఓరియంటేషన్ కార్యక్రమం
నేటి సాక్షి, కరీంనగర్: సీడీపీవోలు, సూపర్వైజర్లు అత్యుత్తమ సేవలందిస్తూ అంగన్వాడీ కేంద్రాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. బాధ్యతయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. బుధవారం తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీకాలనీలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో జిల్లాలోని సీడీపీవోలు, ఏసీడీపీలు, సూపర్వైజర్లు, ఎంపిక చేసిన అంగన్వాడీ టీచర్లు, పోషణ అభియాన్ సిబ్బందికి ప్రీస్కూల్ (ఎన్సీఎఫ్ఎఫ్ఎస్) పై ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. చిన్నారులకు ఆటపాటలతో నాణ్యమైన విద్యను అందించాలని పేర్కొన్నారు. టీచర్లు తల్లులతో తరచూ మాట్లాడుతూ చిన్నారుల యోగా క్షేమాలు తెలుసుకోవాలని అన్నారు. దీంతో అంగన్వాడీ కేంద్రాలపై మంచి అభిప్రాయం కలుగుతుందని పేర్కొన్నారు. సీడీపీఓలు, సూపర్వైజర్లు పనితీరు మరింత మెరుగుపరచుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విధుల నిర్వహణపైనే దృష్టి సారించాలని, బాధ్యతాయుతంగా పనిచేయాలని పేర్కొన్నారు.
సంపూర్ణ ఆరోగ్యానికి కృషి చేయాలి
చిన్నారులు, గర్భిణులు, కిశోర బాలికల సంపూర్ణ ఆరోగ్యానికి కృషి చేయాలని కలెక్టర్ తెలిపారు. చిన్నారుల హాజరు శాతాన్ని పెంచేందుకు కష్టపడి పని చేయాలని సూచించారు. అంగన్వాడీల పనితీరు బాగుంటేనే ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెరుగుతుందని తెలిపారు. విద్యార్థులు చదివేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తారని చెప్పారు. అంగన్వాడీల్లో విద్య పూర్తికాగానే, చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేలా టీచర్లు చొరవ చూపాలని సూచించారు. ఒక పద్ధతి ప్రకారం విధులు నిర్వర్తిస్తే మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు.
తప్పులు లేకుండా సర్వే చేయాలి
ఇంటింటా కుటుంబ సర్వేను తప్పుడు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. తద్వారా చిన్నారులు, గర్భిణుల వివరాలు తెలుస్తాయని తెలిపారు. గర్భిణులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మంచి వైద్యం అందించే అవకాశం ఉంటుందని చెప్పారు. అన్నింటికీ ఈ డాటా సరిపోతుందని చెప్పారు. అంగన్వాడీల్లో బడిబాట కార్యక్రమాన్ని పక్కాగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులతో మాట్లాడి చిన్నారులను అంగన్వాడీల్లో చేర్పించాలని సూచించారు. వారం, వారం సీడీపీవోలు అంగన్వాడీ టీచర్లతో సమావేశాలు నిర్వహిస్తూ పనితీరును తెలుసుకోవాలని తెలిపారు. అదేవిధంగా అంగన్వాడీల్లో హాజరు శాతం పెరిగేలా జిల్లా సమైక్య ప్రతినిధులతో సమావేశం నిర్వహించాలని సూచించారు.
మౌలిక వసతుల కల్పనకు కృషి
జిల్లాలోని 201 అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు ఏదైనా అవసరం ఉంటే పరిశీలించి చెప్పాలని సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. పక్కాగా వివరాలు చెబితే నిధులు మంజూరు చేస్తానని వెల్లడించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా అంగన్వాడీలను తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్ ఉపయోగిస్తూ చిన్నారులకు మంచి విద్యను అందించాలని సూచించారు. చిన్నారులు, గర్భిణులకు పోషకాహారం అందేలా ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అంగన్వాడీ టీచర్లకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. టీచర్లు, ఆయాల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని పేర్కొన్నారు. అంగన్వాడీల బలోపేతంతోనే మంచి ఫలితాలు వస్తాయని జిల్లా కలెక్టర్ సూచించారు. పలు అంశాలపై మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, సిడిపిఓలు సవిత, తిరుమల, సౌందర్య, లక్ష్మణ్ దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం జిల్లా మేనేజర్ పీ జయశ్రీ, పోషణ్ అభియాన్ కోఆర్డినేటర్ నాగరాజు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.