నేటి సాక్షి రిపోర్టర్ భూక్యా రవి నాయక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అక్రిడేషన్ కార్డు ఉన్నవారికే వాహనాలపై ‘ప్రెస్’ అని రాసుకునే హక్కు ఉందని, అక్రిడేషన్ లేని వారు అలా రాసుకుంటే మోటారు వాహన చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రకటించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు విరుద్ధమని ఆయన మండిపడ్డారు.ఈ ఉత్తర్వులు కేవలం చట్ట అమలు చర్యలు కావని, జర్నలిస్టులను భయభ్రాంతులకు గురిచేసి ప్రశ్నించే స్వరాన్ని మౌనం చేయాలనే ప్రయత్నంగా భావించాల్సి ఉంటుందని అన్నారు. అక్రిడేషన్ కార్డు ఉంటేనే జర్నలిస్టా? అక్రిడేషన్ ఉన్న ప్రతివ్యక్తి నిజంగా జర్నలిస్టేనా? అక్రిడేషన్ లేకుండా ప్రజాసమస్యలపై నిజాయితీగా వార్తలు రాస్తున్న వారు జర్నలిస్టులు కారా? అనే మౌలిక ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో వేలాదిమంది జర్నలిస్టులు ఉద్యోగాలు లేని పరిస్థితుల్లో జీవనాధారం కోసం జర్నలిజాన్ని వృత్తిగా ఎంచుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. డిగ్రీలు, పీజీలు చదివినా ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా మారిన యువత జర్నలిజాన్ని ఆశ్రయిస్తే దానిని తప్పుగా ఎందుకు చూస్తున్నారని ప్రశ్నించారు. కాలయాపన చేయకుండా, సమాజ సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చే జర్నలిస్టుగా పనిచేయడం నేరమా? అని ప్రభుత్వాన్ని నిలదీశారు.ఇక్కడ ఒక తీవ్రమైన ద్వంద్వ వైఖరి స్పష్టంగా కనిపిస్తోందని భూక్యా రవి నాయక్ విమర్శించారు. పొలిటికల్ సైన్స్ చదవని వారు ముఖ్యమంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులుగా వ్యవహరించవచ్చని, కానీ జర్నలిజం చదవని లేదా అక్రిడేషన్ లేని వారు జర్నలిస్టులుగా పనిచేస్తే మాత్రం తప్పుగా ఎందుకు భావిస్తున్నారని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులకు విద్యార్హతలు అవసరం లేదని రాజ్యాంగం చెబుతుంటే, జర్నలిస్టులకు మాత్రం ప్రభుత్వ కార్డు తప్పనిసరి అన్న భావన ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు.‘ప్రెస్’ అనేది ప్రభుత్వ ముద్ర కాదని, అది జర్నలిస్టు వృత్తి గుర్తింపని ఆయన స్పష్టం చేశారు. అక్రిడేషన్ అనేది ప్రభుత్వ సౌకర్యార్థం జారీ చేసే పరిపాలనా పత్రం మాత్రమే తప్ప, జర్నలిస్టు హోదాకు ప్రమాణం కాదన్నారు. అలాంటి అక్రిడేషన్‌ను ఆధారంగా చేసుకుని ‘ప్రెస్’ అనే పదాన్ని వాడే హక్కును పరిమితం చేయడం ప్రమాదకరమైన దిశగా తీసుకెళ్తుందని హెచ్చరించారు.వాహనాలపై ‘ప్రెస్’ అనే పదాన్ని నిషేధించడం ద్వారా జర్నలిస్టులను రోడ్లపై అనుమానితులుగా మార్చే ప్రయత్నం జరుగుతోందని, ఇది జర్నలిస్టులపై మానసిక ఒత్తిడిని పెంచే చర్యగా పేర్కొన్నారు. జర్నలిస్టులు అక్రిడేషన్ ఉన్నా లేకపోయినా మాట్లాడే హక్కు, రాసే హక్కు రాజ్యాంగం ఇచ్చిన హక్కులేనని గుర్తు చేశారు.అక్రిడేషన్ దుర్వినియోగం జరుగుతుంటే దానిపై విచారణ చేయవచ్చని, కానీ జర్నలిస్టులందరినీ ఒకే గూటికి కట్టి అనుమానించడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. అక్రిడేషన్ ఆధారంగా ‘ప్రెస్’ హక్కును కట్టడి చేసే ఈ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈ నిర్ణయాన్ని భూక్యా రవి నాయక్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.





