నేటి సాక్షి.ఫిబ్రవరి 11: ప్రతినిధిరాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో శివరాంపల్లి సులేమాన్ చెరువు సమీపంలో కొనసాగుతున్న అక్రమ సెల్లార్ తవ్వకాలు తీవ్ర వివాదానికి దారితీశాయి. అనుమతులు ఉన్నాయా.? లేవా.? అన్న ప్రశ్నలకు సమాధానం లేకుండానే పనులు దూసుకుపోతుండగా,సంబంధిత అధికారుల మౌనం అనుమానాలకు తావిస్తోందని స్థానిక ప్రజలు వాపోతున్నారు.భారీ యంత్రాలతో లోతుగా తవ్వకాలు జరుగుతున్నప్పటికీ టౌన్ ప్లానింగ్, మున్సిపల్ విభాగాల నుంచి ఎలాంటి నిరోధక చర్యలు కనిపించకపోవడం ప్రజల్లో ఆగ్రహాన్ని రగిలిస్తోంది. నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నా, తనిఖీలు, నోటీసులు, పనుల నిలిపివేత వంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.సాధారణ ప్రజలు చిన్న నిర్మాణానికి కూడా అనుమతుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుండగా,ఇంత భారీగా సెల్లార్ తవ్వకాలు జరుగుతుంటే అధికార యంత్రాంగం ఎలా కళ్లుమూస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఇది నిర్లక్ష్యమా.? లేక మౌన సమ్మతమా.? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు.నిబంధనలు పాటించకపోతే ప్రమాదాలు తలెత్తే అవకాశం ఉన్నప్పటికీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం తీవ్రమైన వైఫల్యంగా మారుతోందని స్థానికులు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్థల పరిశీలన చేపట్టి, అనుమతులు లేకుండా పనులు జరుగుతున్నట్లయితే వెంటనే నిలిపివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే అధికార యంత్రాంగం మాటల్లో కాక, చేతల్లో కఠిన చర్యలు చూపించాల్సిన సమయం ఆసన్నమైందని అంటున్నారు.

