నేటి సాక్షి వికారాబాద్ :గిరిజన బాలిక అనూష మృతి పై విచారణ జరపాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం వికారాబాద్ జిల్లా బాలల సంక్షేమ సమితి, జిల్లా బాలల పరిరక్షణ అధికారికి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పలు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ భూ యజమాని అంతమొల్ల దయాకర్ రెడ్డి బలవంతంగా 14 సంవత్సరాలు నిండని అనూషతో పనిచేయించుకోవడం వల్లనే ఆమె మృతి చెందిందని అన్నారు. స్వయానా రాజకీయ నాయకుడైన ఆయన బాధితుల ఆర్థిక, సామాజిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని వారికి అతి తక్కువ వేతనం చెల్లిస్తూ పని చేయించుకున్నారని తెలిపారు. పనికి వెళుతున్న క్రమంలో ట్రాక్టర్ బోల్తా పడి గిరిజన బాలిక అనూష మృతి చెందడానికి దయాకర్ రెడ్డి పూర్తి బాధ్యుడని పేర్కొన్నారు. పోలీసులు మాత్రం దీనిని సాధారణ యాక్సిడెంట్ కేసుగా నమోదు చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఆమెను బాల కార్మికురాలిగా నిర్ధారించడంలో పోలీసులు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు. రాజకీయ అండదండలు ఉండడంతోనే దయాకర్ రెడ్డి పై బాలల హక్కుల చట్టం ప్రకారం కేసు నమోదు చేయడానికి పోలీసులు వెనుకాడుతున్నారని అన్నారు. అధికారులు ఈ విషయంపై సమగ్ర విచారణ చేపట్టి ఆమెను బాల కార్మికురాలిగా గుర్తిస్తూ బాధ్యుడైన దయాకర్ రెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై త్వరలోనే నవాబ్ పేట్ మండల కేంద్రంలో దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి పోరాటానికి కార్యాచరణ సిద్ధం చేయనున్నట్లు సంఘం నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల మల్లేశం, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి వై.గీత, బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా కన్వీనర్ బి.శివరాజ్, ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు గుట్టకింది రవికుమార్, విహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, పిడిఎస్ యు జిల్లా ఉపాధ్యక్షులు బి.శ్రీకాంత్, వివిధ ప్రజా సంఘాల నాయకులు ఉమ, జామ దశరథ్, శ్రీనివాస్, బి.నరేందర్, ఎ.మల్లేష్, పి.రమేష్ తదితరులు పాల్గొన్నారు.





