Tuesday, March 17, 2026

అపోలోలో “ఏఐ ఇన్‌ హెల్త్‌కేర్‌” మాడ్యూల్‌ ప్రారంభం– వైద్య విద్యలో నూతన దిశగా అపోలో అడుగు

నేటి సాక్షి తిరుపతి(బాదూరు బాల)చిత్తూరు, నవంబర్‌ 13: వైద్యరంగ భవిష్యత్తు కృత్రిమ మేధస్సు దిశగా పయనిస్తున్న ఈ సమయంలో ది అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌ (ఏఐఎంఎస్‌ఆర్‌), చిత్తూరు వైద్య విద్యలో కొత్త దశకు నాంది పలికింది. 2025 బ్యాచ్‌ వైద్య విద్యార్థుల కోసం ‘ఏఐ ఇన్‌ హెల్త్‌కేర్‌’ పేరుతో ప్రత్యేక మాడ్యూల్‌ను ప్రారంభించింది.స్థానిక మురకంబట్టులోని ఏఐఎంఎస్‌ఆర్‌ పరిపాలన భవనంలో గురువారం ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డా. సాంగీతా రెడ్డి వీడియో సందేశం ద్వారా మాట్లాడుతూ… “కృత్రిమ మేధస్సు ఆధారిత ఆరోగ్య సంరక్షణ వేగంగా విస్తరిస్తోంది. ఈ పరిణామానికి నాయకత్వం వహించడం అపోలో లక్ష్యం” అని ఆమె అన్నారు. మైక్రోసాఫ్ట్‌తో కలిసి డిసెంబర్‌లో ‘డాక్టర్‌ కో-పైలెట్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించిన ఆమె, ఇది వైద్యుల క్లీనికల్‌ నిర్ణయాలను వేగంగా, ఖచ్చితంగా తీసుకునేందుకు దోహదం చేస్తుందని తెలిపారు. “భారతదేశం వంటి దేశంలో సుస్థిర ఆరోగ్య సంరక్షణకు డేటా ఆధారిత నిర్ణయాలు, టెక్నాలజీ విస్తరణ అత్యవసరమని, త్వరలో రెండు కొత్త క్యాన్సర్‌ గుర్తింపు కేంద్రాలు కూడా ప్రారంభించనున్నాం,” అని పేర్కొన్నారు.ది అపోలో యూనివర్శిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ వినోద్‌ భట్ మాట్లాడుతూ, “అపోలో ఎల్లప్పుడూ విద్యా నాణ్యత, ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇస్తుంది. ఏఐ ఇన్‌ హెల్త్‌కేర్‌ మాడ్యుల్‌ ద్వారా విద్యార్థుల్లో శాస్త్రీయ దృష్టి, డేటా ఆధారిత నిర్ణయ సామర్థ్యం, రోగి సంరక్షణలో సమర్థత పెరుగుతాయి” అని అన్నారు. మెడికల్‌ సైన్స్‌ అనేది ఖచ్చితమైన శాస్త్రం కాదని.. ప్రతి రోగి స్థితి, జన్యు సంబంధాలను బట్టి చికిత్స మారుతుంటుంది. విద్యార్థులు ఏఐని అర్థం చేసుకుని దాన్ని సృజనాత్మకంగా ఉపయోగించాలి” అని సూచించారు. అపోలో హాస్పిటల్స్‌ సీఈఓ శివరామకృష్ణన్ వి., వర్చువల్‌గా పాల్గొని మాట్లాడుతూ – ఏఐ భవిష్యత్తును నిర్వచించే శక్తి. ఆంధ్రప్రదేశ్‌లో గూగుల్‌ సంస్థ 15 బిలియన్‌ డాలర్లతో ఏఐ డేటా సెంటర్‌ ఏర్పాటు చేస్తోంది. మైక్రోసాఫ్ట్‌ కూడా పోర్చుగల్‌ దేశంలో బహుళ బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెడుతోంది. ఇది ఏఐ ప్రభావం ఎంత విస్తృతమో తెలియజేస్తుంది,” అని ఆయన అన్నారు. వైద్యులు, ఏఐ కలసి పనిచేస్తే ఆరోగ్య సేవలు మరింత ఖచ్చితమైనవి, వేగవంతమైనవి అవుతాయి. భవిష్యత్తులో మెడిసిన్‌తో పాటు నర్సింగ్‌, అలైడ్‌ హెల్త్‌ సైన్సెస్‌ తదితర విభాగాల్లో కూడా ఏఐ మాడ్యూల్‌లను ప్రవేశపెట్టనున్నాం,” అని ఆయన వెల్లడించారుఈ కార్యక్రమంలో అపోలో చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ అశీష్‌ శర్మ, ఎఐఎంఎస్ఆర్ డీన్‌ డా. అల్ఫ్రెడ్‌ జె. అగస్టిన్, అసోసియేట్‌ డీన్లు డా. రమ్యా రామకృష్ణన్‌, డా. ఉషా అదిగా, విభాగాధిపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం “ఎఐఇన్ హెల్త్ కేర్ ” పై మొదటి లెక్చర్‌ ప్రారంభమైంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News