నేటి సాక్షి తిరుపతి(బాదూరు బాల)చిత్తూరు, నవంబర్ 14: అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (ఏఐఎంఎస్‌ఆర్) పాథాలజీ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం అపోలో నాలెడ్జ్ సిటీ క్యాంపస్‌లోని ఏఐఎంఎస్‌ఆర్ క్లినిక్‌లో స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. అంతర్జాతీయ పాథాలజీ వారోత్సవాలను పురస్కరించుకుని శిబిరాన్ని నిర్వహించగా, వైద్య విద్యార్థులు, నర్సింగ్, బిఎస్‌సి-ఎంఎల్‌టి, బిపిటి విభాగాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో రక్తదానం చేశారు. ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు శిబిరం కొనసాగింది. ఈ సమయంలో పెద్ద సంఖ్యలో రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేశారు. రక్తదానం మనుషుల ప్రాణాలను కాపాడే అత్యంత విలువైన సేవ అని పాథాలజీ విభాగం హెచ్‌ఓడీ ప్రొఫెసర్ డాక్టర్ పి. విజయ్‌కుమార్ తెలిపారు. రక్తం అవసరమైనప్పుడు దొరక్క ప్రాణాలు కోల్పోయే ఘటనలు ఇటువంటి కార్యక్రమాల ద్వారా తగ్గుతాయని పేర్కొన్నారు. సమాజంలో రక్తదానంపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని, యువత ముందుకు వస్తుండటం హర్షణీయమని ఆయన అన్నారు.శిబిరానికి వచ్చిన రక్తదాతలందరికీ అపోలో వైద్య బృందం అవసరమైన రక్తపరీక్షలు నిర్వహించి, సురక్షిత ప్రమాణాలతో రక్త సేకరణ చేపట్టింది. ఆరోగ్యపరంగా వారు ఫిట్‌గా ఉన్నారో లేదో సిబ్బంది నిర్ధారించిన అనంతరం రక్తదానం చేయించారు. పాల్గొన్న రక్తదాతలకు ధృవపత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో పాథాలజీ విభాగానికి చెందిన ప్రొఫెసర్లు డాక్టర్ సీ. ఆర్. సిరాజున్నీసా బేగమ్, డాక్టర్ ఎస్. భావదీప్ కుమార్‌రెడ్డి, ఫ్యాకల్టీ సభ్యులు, వివిధ విభాగాల విద్యార్థులు పాల్గొన్నారు.





