నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)చిత్తూరు, డిసెంబర్ 20: ది అపోలో యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో శనివారం ఒకరోజు జాతీయ స్థాయి హెల్త్‌కేర్ మేనేజ్మెంట్ సదస్సును విజయవంతంగా నిర్వహించారు. డా. ప్రతాప్ సి. రెడ్డి నాలెడ్జ్ సెంటర్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి దక్షిణ భారతదేశంలోని నాలుగు రాష్ట్రాల వివిధ యూనివర్సిటీల నుంచి 150 మందికి పైగా ప్రతినిధులు హాజరయ్యారు.సదస్సును యోగి వేమన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొ. రాజశేఖర్ బెల్లంకొండ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హెల్త్‌కేర్ రంగంలో సమర్థవంతమైన నిర్వహణకు డేటా కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ప్రతి విద్యార్థి నిరంతరం తనను తాను అప్డేట్ చేసుకోవాలని సూచించారు. యూనివర్సిటీ సిలబస్‌తో పాటు సర్టిఫికేషన్ కోర్సులు కూడా తప్పనిసరిగా ఉండాలన్నారు. ఆసుపత్రుల్లో డిశ్చార్జ్ ఆలస్యం, ఇన్సూరెన్స్ కో–ఆర్డినేషన్ లోపాల వల్ల రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఈ సమస్యలన్నిటికీ సమర్థవంతమైన హెల్త్‌కేర్ మేనేజ్మెంట్ ద్వారానే పరిష్కారం సాధ్యమని, ఈ దిశగా మేనేజ్మెంట్ నిపుణుల పాత్ర ఎంతో కీలకమని ఆయన స్పష్టం చేశారు.అపోలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డా. హెచ్. వినోద్ భట్ మాట్లాడుతూ, 1983లో అపోలో హాస్పిటల్స్ ప్రైవేట్ కార్పొరేట్ హెల్త్‌కేర్ రంగంలో ప్రవేశించినప్పుడు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని తెలిపారు. వాటన్నింటిని అధిగమిస్తూ నేడు అపోలో గ్రూప్ 14 వేల పడకలతో ప్రపంచంలోనే అతిపెద్ద కార్పొరేట్ హాస్పిటల్ గ్రూప్‌గా ఎదిగిందన్నారు. క్యాన్సర్ చికిత్సలో అత్యాధునిక ప్రోటాన్ థెరపీ యూనిట్‌ను భారత్‌లో తొలిసారిగా ఏర్పాటు చేసిన ఘనత అపోలోకే దక్కిందని చెప్పారు. జనరల్ ఎంబిఎకు, హెల్త్‌కేర్ మేనేజ్మెంట్లో ఎంబిఎకు మధ్య తేడా ఉందని, ఈ రంగంలో నైతిక విలువలు కీలకమని వివరించారు. ఏఐ రాబోయే రోజుల్లో వ్యాధిని గుర్తించిన క్షణాల్లోనే దానికి తగిన మందులను సిద్ధం చేసే స్థాయికి వైద్యం అభివృద్ధి చెందుతుందని చెప్పారు.అపోలో నాలెడ్జ్ సీఈఓ శివరామకృష్ణన్ వెంకటేశ్వరన్ వర్చువల్‌గా మాట్లాడుతూ, ఎంబిఎ కెరియర్లో ప్రాక్టికల్ అనుభవం, డిబేటింగ్ నైపుణ్యాలు కీలకమని తెలిపారు. విజన్, వ్యూహాలు ఎంత బలంగా ఉన్నా తాజా డేటా లేకపోతే ఫలితం ఉండదని, కాస్ట్ కంట్రోల్, బడ్జెట్, క్యాష్ ఫ్లో మేనేజ్మెంట్పై స్పష్టత అవసరమన్నారు. డా. ప్రతాప్ సి. రెడ్డి తన 60వ ఏట భారత్‌లో తొలి కార్పొరేట్ హాస్పిటల్‌ను ప్రారంభించారని, హార్ట్ సర్జరీ కోసం విదేశాలకు వెళ్లలేక ఒక యువకుడు మరణించడంతో ఆయనను ఆ సంఘటన కదిలించిందని, దానితోనే దేశంలో కార్పొరేట్ వైద్యానికి పునాది పడిందని గుర్తు చేశారు. నేడు అపోలో గ్రూప్ దేశవ్యాప్తంగా వేలాది ఫార్మసీలు, 74 అత్యున్నత కార్పొరేట్ హాస్పిటల్స్‌ను నిర్వహిస్తూ అగ్రస్థానంలో ఉందన్నారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ డీన్ ప్రొ. జి.వి.ఆర్.కే. ఆచార్యులు మాట్లాడుతూ, హెల్త్‌కేర్ రంగంలో ఇటీవల జరిగిన వేగవంతమైన మార్పులు, మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్ ఎదుర్కొంటున్న సవాళ్లపై వివరించారు. అనంతరం హెల్త్‌కేర్ మేనేజ్మెంట్ ప్లేస్మెంట్ బ్రోచర్‌ను ఆవిష్కరించారు.స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ డీన్ డా. రామయ్య ఇటుమల్ల కన్వీనర్‌గా నిర్వహించిన ఈ సదస్సులో అతిథులుగా అపోలో నాలెడ్జ్ సిటీ యూనిట్ హెడ్ ఎస్. బాలరాజ్, ప్రొ. డా. ప్రభాకర్, పలువురు డీన్లు, అధ్యాపకులు పాల్గొన్నారు. హెల్త్‌కేర్ మేనేజ్మెంట్లోని నూతన ధోరణులు, సవాళ్లు, అవకాశాలపై విస్తృతంగా చర్చలు జరిగాయి. విద్యార్థులు, పరిశోధకులు చురుకుగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.





