ప్రజలకు అవసరమైన అన్ని అభివృద్ధి పనులు చేపడదాం – మేయర్ డాక్టర్ శిరీష
అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నాం – కమిషనర్ ఎన్.మౌర్య
నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల)
తిరుపతి నగరపాలక సంస్థ
నగరంలోని అన్ని వార్డుల్లో అభివృద్ధి, ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడమే మనందరి అజెండాగా ముందుకు నడుద్దామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కార్పొరేటర్లకు, అధికారులకు పిలుపునిచ్చారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సాధారణ సమావేశం బుధవారం ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్ నందు మేయర్ డాక్టర్ శిరీష అధ్యక్షతన జరగగా కమిషనర్ ఎన్.మౌర్య అజెండాను ప్రవేశ పెట్టారు. కౌన్సిల్ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితులుగా తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎం.ఎల్.సి. సిపాయి సుబ్రమణ్యం హాజరయ్యారు. డిప్యూటీ మేయర్లు ముద్ర నారాయణ, ఆర్.సి.మునికృష్ణ, కార్పొరేటర్లు, అధికారులు పాల్గొని పలు అంశాలపై చర్చించి అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. నగరంలోని ప్రజలకు ఆహ్లాదాన్ని అందిస్తున్న ప్రకాశం పార్కు, వినాయక సాగర్ నిర్వహణకు కావలసిన నిధుల మంజూరుకు ఆమోదం తెలిపారు. వర్షాల నేపథ్యంలో నగరంలోని ప్రధాన కాలువల్లో చెత్త, మట్టి తొలగించేందుకు, ఆయా వార్డుల్లో కమిషనర్ పర్యటనలో వచ్చిన సమస్యలు, కార్పొరేటర్ల వినతి మేరకు సి.సి.రోడ్ల ఏర్పాటుకు, డ్రైనేజీ కాలువల నిర్మాణానికి, వర్షపు నీరు సజావుగా వెళ్లేందుకు కాలువల నిర్మాణానికి, అధికారుల అద్దె వాహనాలకు, వీధి దీపాల విభాగంలో ఔట్ సోర్సింగ్ పై పని చేస్తున్న 38 మందికి మూడు వేల రూపాయల వంతున అదనంగా ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్మాణం నిధుల కొరకు నగరంలోని బస్టాండ్ సమీపంలోని మున్సిపల్ స్థలం విక్రయం వాయిదా వేశారు, అలాగే హెల్త్ అసిస్టెంట్ పోస్టుల వ్యవహారం కోర్టులో ఉన్నందున రెండు అంశాలను వాయిదా వేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ స్మార్ట్ సిటీ నిధులతో చేపట్టిన సిటీ ఆపరేషన్ సెంటర్ భవనం నిధుల లేక ఆగిపోయిందని, మున్సిపల్ కార్పోరేషన్ కు సంబంధించి నిరుపయోగంగా ఉన్న స్థలాలను విక్రయించి పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. ఈ మేరకు నిరుపయోగంగా ఉన్న బస్టాండ్ సమీపంలోని మున్సిపల్ స్థలాన్ని విక్రయించి పెండింగ్ లో ఉన్న నలభై శాతం పనులు పూర్తి చేసి పరిపాలన భవనాన్ని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారని ఆయన చెప్పారు. అయితే మున్సిపల్ స్థలం అమ్మకం ప్రతిపాదన సాధ్యాసాధ్యాలు, ప్రత్యామ్నాయ మార్గాలపై ఓ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కమిటీ పదిహేను రోజుల్లో నివేదిక సిద్ధం చేశాక మరోసారి కౌన్సిల్ సమావేశమై నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ నగరంలోని ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించే అభివృద్ధి పనులు చేద్దామని అన్నారు. సి. ఓ.సి. భవనం నిర్మాణానికి కావలసిన నిధుల సేకరణకు స్థలాలు విక్రయించకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చేపట్టాలని అన్నారు. కమిషనర్.మౌర్య మాట్లాడుతూ నగరంలో అన్ని వార్డుల్లో పర్యటించినప్పుడు వచ్చిన సమస్యలు, కార్పొరేటర్ల వినతుల మేరకు అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు. ఇందుకు అందరూ సహకరించాలని అన్నారు. సిటీ ఆపరేషన్ సెంటర్ నిర్మాణం త్వరగా పూర్తి చేసేందుకు అందరి సహకారంతో ముందుకు వెళదామని అన్నారు.