Tuesday, July 22, 2025

అభివృద్దే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుంది

ప్రజల కోసం ఏం చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

అర్హత గల ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు

ధనిక పేద తారతమ్యం లేకుండా అందరికీ ఉచిత కార్పొరేట్ విద్యా, వైద్యం

  • ప్రజలకు అందుబాటులో అధికార యంత్రాంగం
  • రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
  • లక్షెట్టిపేట – నేటి సాక్షి (రేగుంట ప్రసాద్):

రాష్ట్రంలోని ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం జిల్లాలోని లక్షెట్టిపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన 30 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర ఆబ్కారీ-మద్యనిషేధ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి-జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర సమాచార సాంకేతిక, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ – ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి ఖుష్బూ గుప్తా, మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్, జి.సి.సి. చైర్మన్ కొట్నాక తిరుపతి, కనీస వేతన బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల ఏర్పాటు, నవీకరణ కార్యక్రమాలను చేపట్టిందని, ఇందులో భాగంగా లక్షెట్టిపేట మండల కేంద్రంలో 8 కోట్ల 50 లక్షల రూపాయల ప్రభుత్వ నిధి, 1 కోటి రూపాయల సింగరేణి నిధులతో సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన వైద్య సేవలు అందించడం కొరకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మండల కేంద్రంలో 10 కోట్ల 20 లక్షల రూపాయల సి.ఎస్.ఆర్., డి.ఎం.ఎఫ్.టి. నిధులతో ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. తరగతి గదులు, మధ్యాహ్న భోజనం నాణ్యత, పరిసరాలను పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థిని, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించడం జరిగిందని తెలిపారు. డైట్ చార్జీలు 40 శాతం, కాస్మోటిక్ చార్జీలు 200 శాతం పెంచి నూతన మెనూ ఖచ్చితంగా అమలు చేస్తూ విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ ఉపాధ్యాయుల నియామకం ద్వారా అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించడం జరుగుతుందని తెలిపారు.

మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాల ద్వారా ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. దండేపల్లి మండలం రెబ్బెనపల్లి గ్రామంలో ఇందిరా మహిళా శక్తి సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా మహిళలకు చేయూతనిస్తూ దండేపల్లి మండలం అందుగులపేట (వెల్గనూర్) గ్రామంలో 4 ఎకరాల విస్తీర్ణంలో 3 కోట్ల రూపాయల వ్యయంతో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, 90 శాతం బ్యాంకు రుణం, 10 శాతం గ్రామ సంఘాల వాటాతో రోజుకు సుమారు 4 వేల 500 నుండి 5 వేల యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి జరిగి సంవత్సరానికి దాదాపు 51 లక్షల రూపాయల రాబడి వస్తుందని తెలిపారు. నర్సింగాపూర్ గ్రామంలో 1 కోటి 63 లక్షల రూపాయల సి. ఎస్. ఆర్. నిధులతో 2/200 కి.మీ. నుండి 3/100 కి. మీ. కొరకు 900 మీటర్ల మేర సి.సి. రోడ్డు నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. 80 లక్షల రూపాయల మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో 4 గ్రామపంచాయతీ భవనాలు, 48 లక్షల రూపాయలతో 4 అంగన్వాడి భవనాల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. లక్షెట్టిపేట మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో 1 కోటి రూపాయలతో ఎస్.సి.ఎస్.డి.ఎఫ్. క్రింద సి. సి. రోడ్లు, మురుగు కాలువల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని తెలిపారు. హాజీపూర్ మండలం చిన్న గోపాల్ పూర్, ర్యాలీ గ్రామాలలో 2 కోట్ల 50 లక్షల రూపాయల ఎస్.టి.ఎస్.డి.ఎఫ్., ఎస్.సి.ఎస్.డి.ఎఫ్ నిధులతో నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. వేంపల్లి, పోచంపహాడ్ శివారులలో 276 ఎకరాల 9 గుంటల భూమి విస్తీర్ణంలో 30 కోట్ల రపాయల వ్యయంతో అత్యాధునిక సదుపాయాలతో ఐ. టి./ ఇండస్ట్రియల్ పార్క్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.

మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని లక్ష్యంగా ఆర్థిక అభివృద్ధి కోసం సంవత్సరానికి 20వేల కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణంగా అందించేందుకు చర్యలు తీసుకుంటామని, మొదటి సంవత్సరం 21 వేల 632 కోట్ల రూపాయలు అందించడం జరిగిందని తెలిపారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆర్. టి. సి. బస్సులు నడిపించేందుకు 600 బస్సుల ప్రతిపాదనలో 150 బస్సులను ఇవ్వడం జరిగిందని, త్వరలో 450 బస్సులను ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, పెరటి కోళ్ల పెంపకం, పాల డైరీ, పెట్రోలు బంకుల నిర్వహణ, మహిళా శక్తి భవనాల ఏర్పాటు, చిన్న పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. రైతు సంక్షేమంలో భాగంగా 70 లక్షల రైతు కుటుంబాలకు రైతు భరోసా క్రింద 9 రోజులలో 9 వేల కోట్ల రూపాయల పెట్టుబడి సహాయం అందించడం జరిగిందని, 21 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయడంతో పాటు పంట నష్టపరిహారం అందించడం జరిగిందని తెలిపారు. 29 లక్షల పంప్ సెట్లను 17 వేల కట్ల రూపాయలతో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 93 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం అందించడం జరిగిందని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచడం జరిగిందని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గానికి 3 వేల 500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లను 22 వేల 500 కోట్ల రూపాయలతో లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకే రాయితీ గ్యాస్ సిలిండర్ అందించడం జరుగుతుందని తెలిపారు. పేదింటి ఆడపిల్లల వివాహానికి కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకం ద్వారా డబ్బులు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టును తిరిగి మొదలు పెడతామని, రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కొరకు ఆర్థిక చేయూత అందించడం జరుగుతుందని తెలిపారు. ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ద్వారా 6 లక్షల 70 వేల ఎకరాలకు సోలార్ పంపుసెట్లను అమర్చడం జరిగిందని తెలిపారు. ప్రజల కోసమే ప్రతి రూపాయి ఖర్చు చేస్తామని తెలిపారు. ఈ నెల 12వ తేదీ నుండి 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు. పేద విద్యార్థులకు అంతర్జాతీయ విద్య ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రారంభిస్తున్నామని తెలిపారు.

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఆదర్శంగా నిలిపేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. లక్షెట్టిపేట మండల కేంద్రంలో కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాలలను ప్రారంభించడం జరిగిందని, ప్రారంభించిన అతి తక్కువ కాలంలో విద్యార్థుల సంఖ్య రెట్టింపు అయిందని తెలిపారు. విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రైవేట్ పాఠశాలల నుండి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలలో చేరుతున్నారని తెలిపారు. మహిళలకు ఆర్థిక చేయూతను అందించేందుకు ఇందిరా మహిళా శక్తి సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కొరకు హాజీపూర్ మండలం వేంపల్లి లో భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేయబడి పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపన చేయడం జిల్లా అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని అన్నారు.

జిల్లాలోని 863 స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా 80 కోట్ల రూపాయల చెక్కులు అందజేశారు. 8 మంది ప్రమాద బీమా లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. రుణ బీమా సంబంధించి 73 లక్షల 37 వేల రూపాయలను 83 మంది సభ్యులకు అందజేశారు. వడ్డీ లేని రుణాలు 8 వేల 750 మందికి 17 కోట్ల 78 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.

అనంతరం హాజీపూర్ మండలం వేంపల్లి గ్రామ శివారులో 212 ఎకరాలలో 30 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఇండస్ట్రియల్ పార్క్, ఆటోనగర్ ఏర్పాటు కొరకు భూమి పూజ నిర్వహించారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు ద్వారా రాబోయే రోజులలో 2 వేల మందికి ఉపాధి లభిస్తుందని, పెద్ద మొత్తంలో పరిశ్రమలు ఏర్పాటు అవుతాయని తెలిపారు. అటవీ శాఖ సంబంధించిన నూతన వాహనాలను ప్రారంభించి వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News