నేటి సాక్షి పాలేరు, అక్టోబర్ 21:* పేదల పక్షపాతిగా ప్రజా ప్రభుత్వం పాలన చేస్తున్నదని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తో కలిసి కూసుమంచి మండలంలో మంగళవారం పర్యటించి పలు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ…. నేలపట్ల గ్రామంలో ముదిగొండ రోడ్డు నుంచి కొత్త చెరువు వరకు రూ. 2 కోట్ల 75 లక్షలతో బీటి రోడ్డు శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు. మునిగేపల్లి నుంచి వీరేంద్ర స్వామి దేవస్థానం వయా వెంకటాపురం మీదుగా 8 కిలోమీటర్ల మట్టి రోడ్డు రూ. 3 కోట్లతో మంజూరు చేశామని, త్వరలోనే ఆ పనులకు శంకుస్థాపన చేస్తామని అన్నారు. నేలపట్ల గ్రామంలో రూ. 34 లక్షలతో అంతర్గత సిసి రోడ్లు నిర్మించామని, మరో 15 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. అంగన్వాడి భవనానికి రూ. 5 లక్షలు, త్రాగునీటి మరమ్మతు పనులకు రెండు లక్షల రూపాయలు, ప్రజా ప్రభుత్వంలో గడిచిన 22 నెలల కాలంలో మొత్తంగా రూ. 6 కోట్ల 31 లక్షల రూపాయలు నేలపట్ల గ్రామ అభివృద్ధికి మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ధర్మతండ గ్రామంలో రూ. 3 కోట్ల 75 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసుకున్నామని అన్నారు. లోక్య తండా నుంచి ధర్మ తండా వరకు కోటి 26 లక్షల రూపాయలతో నిర్మించ తలపెట్టిన రోడ్డు ప్రస్తుతం టెండర్ దశలో ఉందని, వర్షాకాలం లోపు ఆ రోడ్డు శంకుస్థాపన చేస్తామని, రాబోయే వర్షాకాలంలోపు ఈ రోడ్లు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వస్తామని అన్నారు. గత 22 నెలల కాలంలో ప్రజల ఆశీర్వాదంతో ధర్మతండా గ్రామానికి రూ. 46 లక్షలతో అంతర్గత సిసి రోడ్లు నిర్మించుకున్నామని అన్నారు. రూ. 20 లక్షలతో గ్రామ పంచాయతీ భవనం నిర్మించామని, మొత్తం ధర్మతండా గ్రామానికి రూ. 5 కోట్ల 95 లక్షల నిధులు అభివృద్ధి కోసం మంజూరు చేయడం జరిగిందని అన్నారు. పేదల ఆశీర్వాదంతో వచ్చిన ప్రజా ప్రభుత్వం పేద కుటుంబాలకు ఉచితంగా 200 యూనిట్ల విద్యుత్తు, ఉగాది నుంచి రేషన్ కార్డు ద్వారా సన్న బియ్యం, నూతనంగా పేద కుటుంబాలకు రేషన్ కార్డుల జారి, పాత రేషన్ కార్డులలో నూతన సభ్యుల పేర్లు నమోదు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. రైతును రాజు చేయడంలో భాగంగా మొదటి ఏడాదిలో 25 లక్షల మంది రైతులకు 21 వేల కోట్ల రూపాయల 2 లక్షల రుణమాఫీ, సన్న వడ్లకు మద్దతు ధరతో పాటు క్వింటాకు 500 రూపాయల బోనస్ అందించామని, ప్రస్తుత సీజన్లో కూడా బోనస్ ఇవ్వడానికి క్యాబినెట్ నిర్ణయించిందని, రాబోయే వారం నుంచి పది రోజులలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తామని తెలిపారు.పేద ప్రజలకు భరోసా, ధైర్యం అందించేలా ఇందిరమ్మ ఇండ్లను ప్రజా ప్రభుత్వం నిర్మిస్తుందని, పేద ప్రజలకు ఇచ్చిన మాట మేరకు మొదటి దఫాలోనే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 3500 చొప్పున రాష్ట్రంలో మొత్తం 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం మంజూరు చేసిందని, మన నేలపట్ల గ్రామంలో మొదటి విడత క్రింద 18 ఇండ్లు మంజూరు చేశామని, పేదలు ఎక్కడా ఇబ్బంది పడకుండా ప్రతి సోమవారం డబ్బులు విడుదల చేస్తున్నామని అన్నారు. పేదల పక్షపాతిగా ఉన్న ప్రజా ప్రభుత్వం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా భవిష్యత్తులో కూడా అర్హుడైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఎస్ఇ యాకోబ్, పీఆర్ ఎస్ఇ వెంకట్ రెడ్డి, ఖమ్మం ఆర్డీవో నర్సింహారావు, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.





