నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ : ( రమేష్ ) : మట్టి మాఫియా అడ్డూ అదుపూ లేకుండా కార్యకలాపాలు సాగిస్తోంది. మట్టి అక్రమ తవ్వకాలతో రూ.లక్షల్లో దండుకుంటున్నారు. జోగులంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలో ఓ రిజర్వాయర్ (డ్యాం )నుంచి అధికారుల అనుమతులు లేకుండా ప్రతిరోజూ వేల రూపాయల విలువైన మట్టి రవాణా జరుగుతుంది. సంపాదనే టార్గెట్ గా సామాన్యుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ సామాన్యులను దోపిడీ చేస్తున్నారు. పొలాలకు , నూతన గృహ నిర్మాణాలకు ఈ మట్టిని ఉపయోగిస్తుంటారు. వారి అవసరాలను ఆసరాగా చేసుకుని వారి దగ్గర డబ్బులు దండుకుంటున్నారు. ఆ భూమి ప్రభుత్వానిది అయినప్పటికీ గతంతో ఈ భూమి మది అనే రైతులకు ఒక ట్రిప్పుకు రూ.100 నుంచి రూ.150 వరకు చెల్లించి.. సామాన్యుల చెంత రూ.800ల నుంచి రూ.1000 వరకు పైసలు కాజేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండటంతో మాఫియా ఆగడాలకు అంతులేకుండా పోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎలాంటి అనుమతులు లేకపోయినా రూ.లక్షల విలువైన మట్టిని తరలిస్తున్నారు.
అధికారులు మాత్రం తమకు ఫిర్యాదు అందలేదంటూ తమ బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. కొద్ది నెలలుగా మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్నా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మట్టి వ్యాపారులు అధికారులను మచ్చిక చేసుకుని తమకు ఎదురే లేదన్న ధోరణిలో తమ అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. మట్టి అక్రమ తవ్వకాల పై పత్రికల్లో కథనాలు వెలువడుతున్నా ఏ స్థాయిలోనూ పట్టించుకునే నాథుడే కరువయ్యారు. అక్రమ వ్యాపార సామ్రాజ్యాన్ని కొందరు వ్యాపారులు తమను ఎవరూ నియంత్రించలేరన్న ధీమాను ప్రదర్శిస్తున్నారు. మట్టి వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతుండటంతో ఆ వ్యాపారం వైపు ఇటీవల చాలా మంది మక్కువ చూపుతున్నారు. మరీ ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

