నేటి సాక్షి పాలేరు ,డిసెంబర్ 08 :గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి సూచించారు. కూసుమంచి మండలం సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ వేసిన అభ్యర్థులతో ఎన్నికల నియమ నిబంధనలపై విజయరామ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్షణికావేశంతో గొడవలకు పోయి కేసుల పాలు కావద్దని సూచించారు. పోలింగ్ సమయంలో అనవసర ఘర్షణలకు దిగిన, ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను ముందస్తూ బైండోవర్ చేసి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గొడవలు సృష్టించే అవకాశం ఇవ్వద్దని పేర్కొన్నారు. ఓటు హక్కును ఎలాంటి ప్రలోభాలకు,భయబ్రాంతులకు లోను కాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు సద్వినియేగం చేసుకునే వాతావరణాన్ని కల్పించడానికి పోలీస్ శాఖ చేస్తున్న పటిష్టమైన చర్యలకు ప్రతి ఒక్కరు సహకరించాలని అన్నారు. ప్రదానంగా బెల్ట్ షాపులు మద్యం అమ్మకాలు చేస్తే ఉపేక్షించేది లేదని అన్నారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. ఘర్షణ వాతావరణం పూర్తిగా నిర్మూలించేలా ప్రతి ఒక్కరు సమన్వయం పాటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐ సంజీవ్, ఎంపీడీఓ జాశ్వంత్ కుమార్, ఎస్సై నాగరాజు పాల్గొన్నారు.





