- – కార్యకర్తలకు తుపాకులిచ్చి పాకిస్తాన్‌పై యుద్ధానికి పంపిన వీరుడు
- – పార్టీ కంటే దేశం ఫస్ట్ అని నిరూపించిన మహనీయుడు
- – కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
- – శ్యామాప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళి
నేటి సాక్షి, కరీంనగర్: భారతదేశ అసలు సిసలైన హీరో శ్యామాప్రసాద్ ముఖర్జీ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొనియాడారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ యుద్ధాల సమయంలో జన సంఘ్ కార్యకర్తలకు తుపాకీలిచ్చి సైనికులతోపాటు భారతదేశం పక్షాన యుద్ధానికి పంపి, పార్టీకంటే దేశం ఫస్ట్ అని చాటి చెప్పిన గొప్ప వ్యక్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ అని పేర్కొన్నారు. దేశం కోసం ఆత్మ బలిదానం చేసుకున్న ఏకైక జాతీయ పార్టీ అధ్యక్షుడు, పార్లమెంట్లో ఏకైక ప్రతిపక్ష నేత కూడా ఆయనేనని తెలిపారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆదివారం కరీంనగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. అంతకుముందు మహాశక్తి అమ్మవారి ఆలయంలో సంజయ్ తన మాతృమూర్తి శకుంతల సమక్షంలో మొక్క నాటించారు. అనంతరం శ్యామాప్రసాద్ ముఖర్జీ దేశానికి చేసిన సేవలను, త్యాగాన్ని స్మరిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా బండి మాట్లాడారు. కశ్మీర్ వెళ్లడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పర్మిట్ కార్డు తప్పనిసరి చేస్తే నా దేశం వెళ్లడానికి పర్మిట్ కార్డు ఎందుకని ప్రశ్నిస్తూ ‘ఏక్ దేశ్ మే దో విధాన్.. దో ప్రధాన్.. దో నిషాన్.. నహీ నహీ చలేగా… నహీ చలేగా’ అంటూ 370 ఆర్టికల్ రద్దు కోసం పోరాడిన మహనీయుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ అని అన్నారు. ఆనాడు పర్మిట్ అవసరం లేదని పేర్కొంటూ కశ్మీర్ బయలుదేరిన శ్యామాప్రసాద్ ముఖర్జీని నాటి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి కనీస సౌకర్యాలు లేని జైల్లో నిర్బంధానికి గురి చేసిందని, ఆనాడు అటువైపుగా వెళుతున్న నాటి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూకు ముఖర్జీని పరామర్శించాలనే సోయి లేకుండా వెళ్లిపోయిందని విమర్శించారు. ఆ నిర్బంధంలోనే అనుమానాస్పద స్థితిలో ముఖర్జీ మరణిస్తే, కనీసం విచారణ జరపని అమానవీయ ప్రభుత్వం కాంగ్రెస్‌ది అని మండిపడ్డారు. ఆయన చనిపోయాక కశ్మీర్‌కు వెళ్లడానికి వీసా తప్పనిసరి అనే విధానాన్ని నెహ్రూ ప్రభుత్వం రద్దు చేసిందని, ఇది బీజేపీ సాధించిన తొలి విజయం అని పేర్కొన్నారు.
– అంబేద్కర్ సైతం శ్యామాప్రసాద్కు మద్దతు
స్వతంత్ర ఫలాలు అట్టడుగు స్థాయి వరకు తీసుకెళ్లాలని పార్లమెంట్లో పోరాడితే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సైతం శ్యామాప్రసాద్కు మద్దతు తెలిపారంటే ఆయన గొప్పతనం, కమిట్మెంట్ను అర్థం చేసుకోవచ్చని బండి సంజయ్ అన్నారు. ఆనాడు పార్లమెంట్లో నెహ్రూ మాట్లాడుతూ ‘నీ పార్టీ ఎంత? నువ్వెంత? నీ పార్టీని మొత్తం నాశనం చేస్తా’నని చెబితే, అందుకు ప్రతిగా నా పార్టీని నాశనం చేయడం సంగతి తర్వాత, నాశనం చేస్తాననే మీ ఆలోచననే నాశనం చేస్తానంటూ బదులిచ్చిన నాయకుడు శ్యామాప్రసాద్ ముఖర్జీ అని పేర్కొన్నారు. భారతదేశ రక్షణ కోసం అణ్వస్త్రాలు ఉండాలని ఆకాంక్షించిన దూరద్రుష్టి కలిగిన నాయకుడు అని చెప్పారు.
శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆలోచనలు, ఆకాంక్షలు, ఆశయాలను అమలు చేస్తున్న పార్టీ బీజేపీ అని చెప్పారు. ముఖర్జీ ఆకాంక్షలకు అనుగుణంగా వాజ్ పేయి ప్రభుత్వం అణ్వాయుధాలను సమకూరిస్తే, 370 ఆర్టికల్‌ను రద్దు చేసి శ్యామాప్రసాద్ ముఖర్జీ కలను నరేంద్రమోదీ నెరవేర్చారని గుర్తు చేశారు. దేశ విభజన సమయంలో అనుకోని పరిస్థితుల్లో మాతృభూమికి తిరిగి వస్తే పౌరసత్వ సవరణ బిల్లును తీసుకొచ్చిన ప్రభుత్వం నరేంద్ర మోదీదే అని అన్నారు. శ్యామాప్రసాద్ ముఖర్జీ ఆశయాల మేరకు మధ్య దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వ ఫలాలను నేరుగా లబ్ధిదారులకు అందిస్తున్న ప్రభుత్వం నరేంద్రమోదీదేనని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గంగాడికృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమల ఆంజనేయులు, గుగ్గిళ్లపు రమేశ్, మేకల ప్రభాకర్‌యాదవ్, కోమటిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్, ఇనుకొండ నాగేశ్వరరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపెళ్లి శ్రీనివాస్‌గౌడ్, మాడ వెంకటరెడ్డి, బత్తుల లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్‌రావు, పుప్పాల రఘు, మాజీ ఎంపీపీ వాసాల రమేశ్, కార్పొరేటర్లు కోలగని శ్రీనివాస్, పెద్దపల్లి జితేందర్, బండ సుమా రమణారెడ్డి, రాపర్తి ప్రసాద్, పవన్ , ఎన్నం ప్రకాశ్, గజే రమేశ్, బల్బీర్ సింగ్ , శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

