నేటి సాక్షి వికారాబాద్:విద్యార్థులు ఆంగ్ల బోధనపై పట్టు సాధించడంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవాలని జిల్లా విద్యాధికారి (DEO)రేణుకాదేవి పిలుపునిచ్చారు. జిల్లా ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి ‘టెడ్ టాక్’ ‘ఒలింపియాడ్’ పోటీల ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఆంగ్ల భాషా పరిజ్ఞానాన్ని చేరువ చేయడంలో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అసోసియేషన్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. ఈ పోటీల్లో జిల్లా పరిషత్ పాఠశాలలు, కేజీబీవీలు (కేజీబీవీ), మోడల్ స్కూల్స్ విద్యార్థులు రెండు విభాగాల్లో ప్రతిభ చాటారని తెలిపారు. సుమారు 20 మండలాల నుండి విద్యార్థులు ఈ పోటీలకు హాజరయ్యారు.కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు సునీత మేరీ, ప్రధాన కార్యదర్శి ప్రేమ్ కుమార్ గౌడ్లను ఆమె ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో వైఓసి నాయకులు విజయ్ కుమార్, భారతీ ఫౌండేషన్ ప్రతినిధి అరవింద్, జిల్లా ఉపాధ్యక్షులు ఆరాధన, బ్రహ్మచారి, రాజు, నర్సింలు, అంజయ్య, మండల కన్వీనర్లు, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

