నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల రెవెన్యూ డివిజనల్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో నిర్వహిస్తున్న వివిధ పరిపాలనా పనుల పురోగతిని సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు.*జాతీయ రహదారి పనులపై దృష్టి*జాతీయ రహదారి పనులకు సంబంధించిన అవార్డు కాపీలను త్వరగా అందజేయాలని, పెండింగ్‌లో ఉన్న ప్రక్రియలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సమయానుకూలంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.*భూ సమస్యల పరిష్కారం*తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని తెలిపారు. మీసేవ సర్టిఫికెట్లను పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు జారీ చేయాలని అధికారులకు ఆదేశించారు.*ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో ఖచ్చితత్వం అవసరం*ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తూ, ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా పని చేయాలని సూచించారు. తప్పు నమోదు జరగకుండా ప్రతి ఇంటి నుంచి ఖచ్చితమైన వివరాలు సేకరించాలని, అన్ని స్థాయిల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.ఈ తనిఖీలో కలెక్టర్ వెంట కోరుట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి జీవాకర్ రెడ్డి, తహసీల్దార్లు మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.____

