- కలెక్టర్ పమేలా సత్పతి
నేటి సాక్షి, కరీంనగర్ : జూన్ 2న జరగనున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్లోని తన చాంబర్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. 2న ఉదయం 9 గంటలకు కలెక్టరేట్లో జెండా ఆవిష్కరణ ఉంటుందని తెలిపారు. ఈ వేడుకలకు హాజరయ్యేలా ప్రజాప్రతినిధులు, అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. ఈ మేరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు విస్తృతంగా చేపట్టాలని పేర్కొన్నారు. అమరవీరుల కుటుంబాలకు ఘన సన్మానం ఉంటుందని తెలిపారు. వారి కుటుంబాలకు సమాచారం అందించాలని చెప్పారు. జిల్లాలో గ్రామ పంచాయతీలు, మున్సిపల్, ఎంపీపీ, జడ్పీ కార్యాలయాలు, మండల, జిల్లా అధికారుల కార్యాలయాల్లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని సూచించారు. ఆయా కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించాలని పేర్కొన్నారు. పోలీసు గౌరవ వందనానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని తెలిపారు. వేడుకలు అట్టహాసంగా జరిగేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు.
కలెక్టరేట్లో స్థల పరిశీలన
ఆవిర్భావ వేడుకల నిర్వహణకు కలెక్టరేట్లో అనువైన స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. జెండా ఆవిష్కరణ, వేడుకలు, అతిథుల కోసం ఏర్పాటు చేసే ప్రాంతాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వేడుకల ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ పవన్‌కుమార్, కలెక్టరేట్ ఏవో సుధాకర్, సూపరింటెండెంట్ కాళీచరణ్ తదితరులు పాల్గొన్నారు.