రాసూరి మల్లికార్జున్
నేటి సాక్షి, బెజ్జంకి:
పేదవాడికి సొంత ఇంటి కల నిజమవ్వాలంటే అది ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం అని టీపీసీసీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ సభ్యుడు రాసూరి మల్లికార్జున్ అన్నారు.
గురువారం బెజ్జంకి మండలంలోని వడ్లూర్ గ్రామంలో మామిడి పోచవ్వ ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం మల్లికార్జున్ మాట్లాడుతూ
గత పదేళ్లుగా బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నాయకత్వంలో గ్రామ అభివృద్ధి వేగంగా జరుగుతోందన్నారు.
వడ్లూర్ గ్రామానికి 26 ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యాయనీ, లబ్ధిదారులు వెంటనే నిర్మాణం ప్రారంభించాలని సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం మహిళా సంఘాల ద్వారా ₹1 లక్ష రుణం, అలాగే ₹5 లక్షల సబ్సిడీ నిధులు దశలవారీగా అందించనుందని, ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుకను కూడా ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని వివరించారు.
ఇందిరమ్మ పథకం కింద మంజూరు ప్రక్రియ కొనసాగుతుందని, మొదటి జాబితాలో ఇల్లు రాని అర్హులెవ్వరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ సింగిరెడ్డి తిరుపతిరెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పులి రమేష్, కుక్కల రాములు, బెజ్జంకి అనిల్, మంకాల ప్రవీణ్ కుమార్, కాసాని కనకయ్య, బెజ్జంకి ఎల్లయ్య తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.





