-*నేటి సాక్షి – కోరుట్ల*( రాధారపు నర్సయ్య )కోరుట్ల పట్టణంలో ఆర్‌టీసీ బస్టాండ్ నుండి భీమునిదుబ్బకు వెళ్లే ప్రధాన మార్గాన్ని ఆర్‌టీసీ డిపో మేనేజర్ అకస్మాత్తుగా మూసివేయడం స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. దశాబ్దాలుగా ఉపయోగిస్తున్న ఈ త్రోవ మూసివేయడంతో రోజువారీ రాకపోకలు పెద్ద సవాలుగా మారాయి.*పాత తోవ మూసివేతతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు*కోరుట్లలోని ఆర్‌టీసీ బస్టాండ్ నుంచి శివ సాయి ఆస్పత్రి ముందు గల భీమునిదుబ్బ రహదారిని ఆర్‌టీసీ డిపో మేనేజర్ అనూహ్యంగా మూసివేయడంతో స్థానికులకు రాకపోకలు పూర్తిగా అస్తవ్యస్తమయ్యాయి. ఈ మార్గం భీమునిదుబ్బ, హాజీపూర్, రహమత్‌పూర్ ప్రాంతాల ప్రజలకు ముఖ్య రవాణా సౌకర్యంగా అనేక సంవత్సరాలుగా ఉంది. బస్టాండ్, మున్సిపల్ కార్యాలయం, మార్కెట్ ప్రాంతాలకు వెళ్లే వారికి పెద్ద చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా విద్యార్థులు, మహిళలు, వయోవృద్ధులు ఈ అకస్మాత్తు మార్పుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.*తోవను తిరిగి తెరవాలని ప్రజల డిమాండ్*తోవ మూసివేతపై ఎఐఎంఐఎం టౌన్ అధ్యక్షుడు ఎంఎ. రఫీ, జనరల్ సెక్రటరీ అబ్దుల్ వాజీద్, రహీం హఫీజ్, నిజాం, సురేష్, సమీర్, సల్మాన్, అక్బర్, మెహబూబ్‌తో పాటు మూడో వార్డు, తోవకు ఆనుకొని ఉన్న ఇళ్ల కుటుంబాలు పెద్ద సంఖ్యలో నిరసన వ్యక్తం చేశారు. ప్రజల అవసరార్థం మాత్రమే ఉపయోగించే ఈ మార్గాన్ని యథావిధిగా కొనసాగించాలని, పాఠశాల పిల్లలు ఈ దారినే ఎక్కువగా ప్రయాణించే విషయాన్ని దృష్టిలో ఉంచాలని వారు విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా సద్గురు కమలాకర్ రావు, కిషోర్, కిషన్ గౌడ్, నజ్జు, ఆడెపు మధు వంటి స్థానిక నేతలు కూడా ప్రజల డిమాండ్‌కు మద్దతు తెలుపుతూ తగిన విచారణ జరిపి మూసేసిన తోవను మళ్లీ తెరవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ‘తొవ్వ-వివాదం’ మరింత ముదరక ముందే కోరుట్ల ఎస్ఐ చిరంజీవి రంగప్రవేశం చేసి సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు అందరూ చర్చించుకోవాలే గానీ..వివాదాన్ని మరింత పెద్దగా చేసుకోవద్దని సూచించారు.__________





