- – ప్రభుత్వాన్ని కోరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
నేటి సాక్షి, కరీంనగర్: ఎస్సీ స్టడీ సర్కిల్లో ఉచితంగా ఇస్తున్న డీఎస్సీ–2024 శిక్షణను మరో నెల పొడిగించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను ధర్మపురి, జగిత్యాల, మానకొండూరు ఎమ్మెల్యేలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మేడిపల్లి సత్యం, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. ఈ మేరకు విప్ అడ్లూరి లక్ష్హణ్కుమార్ శనివారం డిప్యూటీ సీఎంకు వినతి పత్రం అందజేశారు. గత నెల 31-05-2024న వరకు రెండు నెలల గడువు ముగియనుండగా, ఈ విషయంలో జగిత్యాల కరీంనగర్ జిల్లాల్లోని అనేక మంది ఎస్సీ నిరుద్యోగ యువకులు తనను సంప్రదించి, కోచింగ్ వ్యవధిని మరో నెల రోజులు పొడిగించేలా చూడమని అభ్యర్థించారని డిప్యూటీ సీఎం దృష్టికి తెచ్చారు. పెద్ద సంఖ్యలో ఎస్సీ ఉద్యోగ యువత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో ఉచిత కోచింగ్ వ్యవధిని మరో నెల రోజులు పొడిగించాలని కోరినట్టు చెప్పారు. దీనికి డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించి, నెల రోజులపాటు ఉచిత శిక్షణ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేస్తామని చెప్పినట్టు విప్ తెలిపారు. యువత సమస్యలపై తక్షణమే స్పందించిన డిప్యూటీ సీఎంకు నిరుద్యోగ యువత పక్షాన ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అడ్లూరి, కవ్వంపల్లి, మేడిపల్లి సత్యం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.