నేటి సాక్షి గజ్వేల్ : —-గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ కూలీలు, నిరుపేద రైతులకు జీవనాధారంగా నిలుస్తున్న ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం క్రమంగా నిర్వీర్యం చేస్తోందని సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఆంక్షా రెడ్డి తీవ్రంగా విమర్శించారు. వర్గల్ మండలంలోని తునికి ఖల్సా, తునికి మక్తా, మీనాజీపేట్, శాకారం, అంబర్‌పేట గ్రామాల్లో సోమవారం ఉపాధి హామీ కూలీలతో విధాన సభలు, సమావేశాలు నిర్వహించి ఆమె మాట్లాడారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్చాలని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించడం అత్యంత దురుద్దేశపూరిత చర్య అని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహానేత మహాత్మా గాంధీ పేరును పథకం నుండి తొలగించాలనే ఆలోచన సిగ్గుచేటని విమర్శించారు.అలాగే ఉపాధి హామీ పథకానికి కేటాయిస్తున్న కేంద్ర నిధుల్లో కోత విధిస్తూ పథకాన్ని బలహీనపరచే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు సమకూర్చాలని పేర్కొంటూ బాధ్యతలను రాష్ట్రాలపై మోపడం సరైంది కాదని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు ఉపాధి కల్పించే ఈ పథకాన్ని క్రమంగా నిర్వీర్యం చేసి పూర్తిగా రద్దు చేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు.వ్యవసాయ కూలీలు, కార్మికుల హక్కులు, వ్యవసాయ అనుబంధ పనులను తొలగించడం ద్వారా జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరచే చర్యలు జరుగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. అయితే నిరుపేద రైతులు, వ్యవసాయ కూలీలు, గిరిజనులు, కార్మికులకు ఉపాధి కల్పించేందుకు అప్పటి యూపీఏ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి కోట్లాది గ్రామీణ ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించిందని గుర్తు చేశారు.ఈ పథకాన్ని రద్దు చేయాలనే కేంద్ర ప్రభుత్వ చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉపాధి హామీ కూలీలతో గ్రామాల వారీగా విధాన సభలు, సమావేశాలు నిర్వహించి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఆంక్షా రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ నిమ్మ రంగారెడ్డి, మాజీ ఎంపీపీ మోహన్, మండల కాంగ్రెస్ సర్పంచుల ఫోరం అధ్యక్షులు వెంకటేష్, సర్పంచులు, ఉప సర్పంచులు విజయలక్ష్మి యాదగిరి, కొండగళ్ల గణేష్, కుమార్ యాదవ్, కుమార్, గోరెమియా, టేకులపల్లి గోవర్ధన్ రెడ్డి, గంగుమల్ల లక్ష్మి, సహదేవ్ గౌడ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, మండల కాంగ్రెస్ శాఖ అధ్యక్షులు పంజాల సాయి గౌడ్, నేతలు గంగుమల్ల కొండల్ రెడ్డి, నీల శ్రీనివాస్, పాషా భాయ్, యాదగిరి, పొన్నాల నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.





