**నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)చిత్తూరు, డిసెంబర్ 22: గ్రామీణాభివృద్ధి, పరిశుభ్రత లక్ష్యంగా ది అపోలో యూనివర్సిటీకి చెందిన జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్.ఎస్.) యూనిట్–2 ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరం సోమవారం చిత్తూరు మండలంలోని ఎన్‌ఆర్ పేట గ్రామంలో ప్రారంభమైంది. డిసెంబర్ 22 నుంచి 28 వరకు వారం రోజుల పాటు సాగనున్న ఈ శిబిరంలో స్వచ్ఛ భారత్ అభియాన్, మొక్కలు నాటడం, ఆరోగ్యం, సాక్షరత, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా ఎన్‌ఆర్ పేట జెడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో అపోలో యూనివర్సిటీ ఎన్ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా. హేమాద్రి రెడ్డి పాల్గొని శిబిరాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, శిబిరంలో భాగంగా స్వచ్ఛ భారత్ అభియాన్, మొక్కలు నాటడం, సాక్షరత కార్యక్రమాలు, కెరీర్ గైడెన్స్, సీపీఆర్ (సిపిఆర్) శిక్షణ, ఆరోగ్య శిబిరం, అవగాహన ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వాలంటీర్లు క్రమశిక్షణతో పాల్గొని గ్రామాభివృద్ధికి తోడ్పడాలని ఆయన సూచించారు.ఎన్ఎస్‌ఎస్ యూనిట్–2 ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. షేక్ జాకీర్ మాట్లాడుతూ, యువతలో సేవాభావం, సామాజిక చైతన్యం పెంపొందించడమే ఈ ప్రత్యేక శిబిరం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. సమాజానికి అవసరమైన కార్యక్రమాల్లో విద్యార్థులు ముందుండి పనిచేయాలని ఆయన సూచించారు.ఎన్‌ఆర్ పేట జెడ్పీ హైస్కూల్ హెడ్‌మాస్టర్ రమేష్ అపోలో యూనిర్శిటీ ఎన్ఎస్‌ఎస్ వాలంటీర్లు చేపడుతున్న కార్యక్రమాలను ప్రశంసిస్తూ, విద్యార్థులు విద్యతో పాటు సామాజిక సేవలోనూ ముందుండటం అభినందనీయమని అన్నారు. శిబిరం నిర్వహణకు నిరంతర సహకారం అందించిన జెడ్పీహెచ్‌ఎస్ ఎన్‌ఆర్ పేట గణిత ఉపాధ్యాయుడు హరి బాబును ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుడు మునిరత్నం రెడ్డి, పంచాయతీ కార్యదర్శి గీత, వీఆర్ఓ సతీష్ కుమార్ పాల్గొని ఎన్ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరానికి గ్రామస్థాయి నుంచి పూర్తి సహకారం అందజేస్తామని తెలిపారు.శిబిరం మొదటి రోజున స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా ఎన్ఎస్‌ఎస్ వాలంటీర్లు గ్రామ రహదారులు, ప్రజా ప్రదేశాలు, పరిసర ప్రాంతాలను శుభ్రం చేస్తూ పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే గ్రామస్తుల్లో పరిశుభ్రత, పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. కార్యక్రమం ముగింపులో ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, గ్రామస్తులు కలిసి పరిశుభ్రత ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 60 మంది ఎన్ఎస్‌ఎస్ వాలంటీర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు.





