నేటిసాక్షి, నల్లగొండ :భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలంటే నిర్మాణాత్మక సంస్కరణలు, సంస్థాగత సామర్థ్యం, సమర్థవంతమైన పాలన, మానవ వనరుల అభివృద్ధి అత్యంత కీలకమని ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్, గోల్డెన్ గేట్ యూనివర్సిటీ, శాన్ ఫ్రాన్సిస్కో (అమెరికా) , డా.విజయ్ కుమార్ వారధి అన్నారు. పట్టణంలోని ఎన్జీ కళాశాలలో రెండు రోజుల నుండి ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ గారి అధ్యక్షతన ఆఫ్ లైన్ లో మరియు అన్ లైన్ లో రెండో రోజు పరిశోధన పత్రాలను ప్రెజెంటేషన్ చేశారు. వికసిత్ భారత్ 2047- వ్యూహాలు మరియు సవాళ్లు అనే అంశం పై ముఖ్య అతిథిగా డా. విజయ్ కుమార్ వారధి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,“వికసిత్ భారత్ ఉన్నత ఆదాయ దేశంగా మారేందుకు అవసరమైన నిర్మాణాత్మక వ్యూహాలు మరియు సంస్థాగత సవాళ్లు” అంశంపై ప్రాధాన్యత గల ఉపన్యాసం అందించారు. కేవలం సాంప్రదాయ ఆర్థిక వృద్ధి సరిపోదని, ప్రస్తుతం ఉన్న 8.2 వృద్ధితో పాటు టెక్నాలజీ ఆధారిత ఇన్నోవేషన్, స్టార్టప్ ఎకోసిస్టమ్ బలోపేతం చేస్తూ పరిశోధన–అభివృద్ధి మరియు నూతన ఆవిష్కరణల పై పెట్టుబడులు పెంచాల్సిన అవసరం ఉందన్నారు.మధ్య ఆదాయ ఉచ్చును అధిగమించడమే దేశానికి ప్రధాన సవాలుగా ఉందని పేర్కొంటూ, ఇందుకు నైపుణ్యాభివృద్ధి, విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు, మానవ మూలధనంలో దీర్ఘకాలిక పెట్టుబడులు అత్యవసరమన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్థిక మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్ గణాంకాలను ఉదహరిస్తూ, టెక్నాలజీ, ఇన్నోవేషన్, టోటల్ ఫ్యాక్టర్ ప్రొడక్టివిటీ పెంపుదల ద్వారానే స్థిరమైన, సమగ్ర వృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ మాట్లాడుతూ, నేషనల్ సెమినార్లు విద్యార్థుల, అధ్యాపకుల్లో పరిశోధనా దృష్టిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి నిపుణుల ఆలోచనలు విద్యార్థులకు భవిష్యత్ దిశానిర్దేశం చేస్తాయని పేర్కొంటూ, ఇలాంటి అకడమిక్ కార్యక్రమాలను కళాశాల మరింతగా ప్రోత్సహిస్తుందని అన్నారు. రెండో రోజు జాతీయ సదస్సు ను విజయవంతం చేసిన టీచింగ్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ కు ధన్యవాదములు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రెండు రోజులు హాజరైన ప్రెజెంటర్స్ కు సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ ప్రొఫెసర్ డా. జ్యోస్న, జాతీయ సదస్సు డైరెక్టర్ డా. మునుస్వామి, కన్వీనర్ డా. అదే మల్లేశం, డిప్యూటీ డైరెక్టర్ డా. బట్టు కిరీటం, ఆర్గనైజింగ్ సెక్రటరీ నర్సింగ్ కోటయ్య, వైస్ ప్రిన్సిపాల్ డా. పరంగి రవి కుమార్, అకడమిక్ కో-ఆర్డినేటర్ బత్తినీ నాగరాజు, డా. వై.వి. ప్రసన్న కుమార్, డా. అనిల్ అబ్రహం, డా. బొజ్జ అనిల్ కుమార్, డా. యస్. ఖరిముల్లా, వేణు ప్రసాద్, పి. సత్యనారాయణ, సోషల్ సైన్స్ విభాగ అధ్యాపకులు, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

