నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో*( రాధారపు నర్సయ్య )రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జగిత్యాల జిల్లాలో ఎన్నికల కోడ్ నియమావళిని అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లోని మిని సమావేశ హాల్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా అడిషనల్ ఎస్పీ శేషాద్రిని రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) బి. రాజ గౌడ్లు కూడా హాజరయ్యారు.*ప్రచార నియమాలకు కట్టుబడి ఉండాలి*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల నిబంధనలు అమలులో ఉన్నందున రాజకీయ పార్టీలకు సంబంధించిన గోడ రాతలు, వాల్ పోస్టర్లు, ఫ్లెక్సీ బ్యానర్లు వెంటనే తొలగించాలని సూచించారు. నామినేషన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల దూరం నిబంధనను కచ్చితంగా పాటించాలని తెలిపారు. ఎన్నికలు జరగనున్న ఐదు మున్సిపాలిటీల్లో ముందస్తు అనుమతులు లేకుండా ఎలాంటి సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.*ఖర్చులు, కరపత్రాలపై స్పష్టత*రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు లోబడి ఎన్నికల ఖర్చులు వినియోగించుకోవాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. ప్రచార కరపత్రాలపై తప్పనిసరిగా ప్రింటర్ వివరాలు ఉండాలని తెలిపారు. జిల్లాలో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ కోరారు.ఈ సమావేశంలో జిల్లా నోడల్ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, జిల్లా ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.___





