నేటి సాక్షి : ఉమ్మడి వరంగల్ (సందెల రాజు)నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా పని చేస్తున్న కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు రావాల్సిన 2025 మే నెల వేతనంతో పాటు పెండింగ్లో ఉన్న 7 నెలల పీ.ఆర్.సీ. ఎరియర్స్ వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మరియు జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా డిమాండ్ చేశారు. శుక్రవారం ఉద్యోగులతో కలిసి హనుమకొండ జిల్లా డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్. అల్లం. అప్పయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ ఆరోగ్య మిషన్ స్కీంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం క్యాడర్లను ఏర్పాటు చేయడం జరిగినదని, పనికి తగిన క్యాడర్ నిర్ణయించి దానికి సమానమైన మూల వేతనాన్ని అమలు చేయాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, హెల్త్ కార్డ్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఉద్యోగికి వారి ఇంటిలో కుటుంబ సభ్యులందరికి వర్తించే విధంగా ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్నారు, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని, ప్రతి నెల 1వ తేదీన వేతనం ఇవ్వాలని కోరారు. ఉద్యోగుల సమస్యల వెంటనే పరిష్కారం చేయాలని డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య ను రాష్ట్ర నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆచంటి అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.

