నేటి సాక్షి తిరుపతి (బాదూరు బాల)చిత్తూరు, డిసెంబర్ 9ః అపోలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (ఎఐఎంఎస్ఆర్)లో మంగళవారం నిర్వహించిన క్లినికల్ మీటింగ్‌లో శ్వాసకోశ, అత్యవసర వైద్య విభాగాలలో క్లిష్టమైన కేసులను ప్రదర్శించి, వాటిపై లోతైన క్లినికల్ విశ్లేషణ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, క్లిష్టమైన ఊపిరితిత్తుల సమస్యలు, హృదయపోటు కేసుల్లో సమయపాలనలాంటి అంశాలపై జరిగిన వివరణాత్మక చర్చలు వైద్య విద్యార్థులు, హౌస్ సర్జన్లకు విశేషంగా ఉపయోపడ్డాయి.తొలి సెషన్లో ‘‘వైట్ అవుట్ లంగ్’’ అంశంపై పీజీ విద్యార్థి డా. వి. అఖిల చేసిన కేస్ ప్రెజెంటేషన్ వైద్యుల దృష్టిని ఆకట్టుకుంది. ఎక్స్‌రేలో ఊపిరితిత్తి పూర్తిగా తెల్లబడే పరిస్థితుల్లో కారణాలు ఎలా గుర్తించాలి? రోగి పరిస్థితిని అంచనా వేసేందుకు ముందుగా చేయాల్సిన పరీక్షలు ఏమిటి? ప్రమాద సూచనలు ఏవి? వంటి కీలక అంశాలను ఆమె స్పష్టంగా వివరించారు. ఈ సెషన్‌కు డా. సాయి కృష్ణ పి. మోడరేటర్‌గా, డా. కె. గౌరీనాథ్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. తదుపరి సెషన్లో సీనియర్ రెసిడెంట్ డా. జ్యోతి రెడ్డి “స్టెమీ థ్రాంబోలైసిస్”పై ప్రాయోగిక పద్ధతులను వివరించారు. తీవ్రమైన హృదయపోటు (స్టెమీ) కేసుల్లో తక్షణ నిర్ణయాలు రోగి ప్రాణాలకు ఎంత కీలకమో ఆయన ఉదాహరణలతో వివరించారు. డోర్-టు-నీడిల్ టైమ్ తగ్గించడం, అత్యవసర విభాగంలో వేగవంతమైన చికిత్స ప్రారంభించడం వంటి అంశాలపై ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో క్లినికల్ మీటింగ్స్ కోఆర్డినేటర్ డా. వి. రాజేష్ కుమార్, వివిధ విభాగాధిపతులు, ఫ్యాకల్టీ సభ్యులు, హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు పాల్గొన్నారు.





