- – కేంద్ర మంత్రి హోదాలో తొలిసారిగా వస్తున్న సంజయ్
- – తొలిరోజు మహాశక్తి, కొండగట్టు, ఎములాడ, సిరిసిల్ల ఆలయాల దర్శనం
- – 20న కిషన్‌రెడ్డితో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి..
- – 21, 22 తేదీల్లో కరీంనగర్ పార్లమెంటు పరిధిలో పర్యటనలు
- – తొలుత ఇద్దరూ కలిసి 19న రావాలని భావించిన కిషన్‌రెడ్డి, బండి
- – కేబినెట్ మీటింగ్ కారణంగా కిషన్‌రెడ్డి పర్యటన రద్దు
- – బండికి ఘన స్వాగతం పలికేందుకు శ్రేణులు సిద్ధం
నేటి సాక్షి, కరీంనగర్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఎల్లుండి (జూన్ 19న) కరీంనగర్ వస్తున్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి కరీంనగర్ విచ్చేస్తున్న బండి సంజమ్కుమర్కు ఘన స్వాగతం పలికేందుకు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని బీజేపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. వాస్తవానికి ఈ నెల 19న ఇద్దరూ కలిసి రాష్ట్రానికి రావాలని కిషన్‌రెడ్డి, బండి సంజయ్ భావించారు. అయితే 19న సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీకి హాజరు కావాలని కొద్ది సేపటి క్రితం కిషన్‌రెడ్డికి సమాచారం రావడంతో తన పర్యటనను మరుసటి రోజుకు వాయిదా వేసుకున్నారు. మరోవైపు ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలున్న నేపథ్యంలో తగిన సమయం లేనందున కరీంనగర్ వెళ్లి కార్యక్రమాల్లో పాల్గొనాలన్న కిషన్‌రెడ్డి సలహా మేరకు బండి సంజయ్ ఈ నెల 19న కరీంనగర్ వస్తున్నారు.
– తొలిరోజు బండి షెడ్యూల్ ఇలా..
తొలిరోజు ఉదయం 9 గంటలకు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని శనిగరం వద్దకు చేరుకుంటారు. అక్కడ పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలుకుతారు. అనంతరం వారితో కలిసి కరీంనగర్ చేరుకుని నేరుగా మహాశక్తి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం చైతన్యపురిలోని తన నివాసానికి వెళ్లి మాతృమూర్తి ఆశీస్సులు తీసుకుంటారు. అక్కడి నుంచి నేరుగా కొండగట్టు బయలుదేరి వెళతారు. కొండగట్టు అంజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తనను కలిసేందుకు వచ్చిన చొప్పదండి నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులతో గడుపుతారు. అనంతరం నల్లగొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తరువాత సాయంత్రం 4 గంటలకు వేములవాడ శ్రీరాజశ్రీరాజేశ్వర ఆలయానికి విచ్చేస్తారు. ఎములాడ రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్థానిక నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలను కలిసి ముచ్చటిస్తారు. అనంతరం సాయంత్రం 7 గంటలకు సిరిసిల్ల నియోజక కేంద్రానికి వెళతారు. పట్టణంలోని మార్కండేయ దేవాలయాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించడంతోపాటు తనను కలిసేందుకు వచ్చిన సిరిసిల్ల నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలను కలుసుకుంటారు. ఆ తరువాత నేరుగా కరీంనగర్ బయలుదేరి వెళతారు.
మరుసటి రోజు (ఈ నెల 20) మధ్యాహ్నం వరకు కరీంనగర్లో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. సాయంత్రం హైదరాబాద్ వెళ్లి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. 21న బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని మానకొండూరు, హుజూరాబాద్, హుస్నాబాద్ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఆయా నియోజకవర్గాల్లోని ప్రసిద్ధి చెందిన దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీంతోపాటు ఆయా నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలను కలుస్తారు. తిరిగి రాత్రి కరీంనగర్ చేరుకుంటారు. 22న కరీంనగర్ పట్టణంలోని శివాలయం, రామేశ్వరాలయం, భగత్‌నగర్ అయ్యప్ప ఆలయాలను సందర్శించడంతోపాటు స్థానికంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 23న ఢిల్లీ పయనమమవుతారు.