– మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎందుకు ఆహ్వానించారంటే
నేటి సాక్షి, హైదరాబాద్: రేపు సాయంత్రం 6 గంటలకు మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ పీఎంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. స్వీకారోత్సవ కార్యక్రమానికి సుమారు 8వేల మంది అతిథులు హాజరుకానున్నారు. వీరిలో ఐశ్వర్య మీనన్ కూడా ఒకరు. వందేభారత్ లోకో పైలట్ ఐశ్వర్య ఎస్ మీనన్‌కు కూడా అధికారులు ఆహ్వానాన్ని అందించారు. దీంతో ఐశ్వర్య ఎస్ మీనన్ ఎవరు అనే చర్చ జరుగుతుంది.
ఐశ్వర్య ఎస్ మీనన్ దక్షిణ రైల్వేలోని చెన్నై డివిజన్ సీనియర్ అసిస్టెంట్ లోకో పైలట్. వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో, జన శతాబ్ధి వంటి వివిధ రైళ్లలో పైలట్‌గా చేస్తూ రెండు లక్షలకుపైగా ఫుట్‌ప్లేట్ గంటలను పూర్తి చేశారు. చెన్నై–విజయవాడ, చెన్నై–కోయంబత్తూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో మీనన్ పనిచేశారు. మీనన్ తన చురుకుదనంతో రైల్వే సిగ్నలింగ్‌పై సమగ్ర పరిజ్ఞానంతో నాణ్యమైన సేవలు అందిస్తూ సీనియర్ అధికారుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి దాదాపు పది మంది లోకో పైలట్లకు ఆహ్వానం అందింది. వారిలో ఐశ్వర్య మీనన్‌తో పాటు ఆసియాలోనే తొలి మహిళా లోకో పైలట్ సురేఖ యాదవ్ కూడా ఉన్నారు. సురేఖ యాదవ్ 1988లో భారతదేశం తొలి మహిళా లోకో పైలెట్ గా చరిత్ర సృష్టించారు. అదేవిధంగా సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులు, పారిశుధ్య కార్మికులు, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు తదితరులు పెద్ద సంఖ్యలో మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకానున్నారు.