నేటి సాక్షి – లక్షేట్టిపేట(రేగుంట ప్రసాద్) నవంబర్ 24: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీ ఏరియాల్లోని ఉప సర్పంచ్, వార్డ్ సభ్యుల రిజర్వేషన్స్ లో ఎస్సీలకు అన్యాయం చేస్తున్నాయని ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ ఐక్య వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు గోళ్ళ రాయమల్లు అన్నారు. సోమవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… 2011 జనాభా లెక్కల ప్రకారం ఏజెన్సీ ఏరియాల్లో ఎస్సీలకు వార్డ్ సభ్యుల రిజర్వేషన్స్ కేటాయించడం అనేది 2018 వరకు జరిగిందన్నారు కానీ 2018 నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీలో ఎస్సీ వార్డ్ సభ్యుల ఎన్నికకు రిజర్వేషన్స్ అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీలను మినహాయించి మిగతా అన్ని వర్గాల వారికి 2018 నుంచి నేటి ఎన్నికల వరకు నూతన జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్స్ కల్పిస్తున్నాయని వివరించారు. ఏజెన్సీ ఏరియాల్లో ఎస్సీలు జన్మించడమే తప్పా? అని ప్రశ్నించారు. ఏజెన్సీ ఏరియాల్లో ఎస్సీ వార్డ్స్ రిజర్వేషన్స్ తొలగించడం వలన ఉప సర్పంచ్ పదవి తమ వర్గాలకు అందకుండా పోతుందన్నారు.అనంతరం అంబేద్కర్ సంఘం జిల్లా నాయకులు చిప్పకుర్తి నారాయణ మాట్లాడుతూ జనాభాలో రెండున్నర శాతం ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్స్ ఇచ్చి బీసీ,ఇతర బలహీన వర్గాలకు తీరని అన్యాయం చేశారన్నారు. ఇప్పటికైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ఎస్సీ పాలకులు ఈ వచ్చే ఎన్నికల్లో ఎస్సీలకు న్యాయం జరిగేలా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ ఐక్య వేదిక మండల ప్రెసిడెంట్ చొప్పదండి రమేష్,మండల నాయకులు తోటపల్లి మహేందర్, లింగంపల్లి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.





