Sunday, January 18, 2026

ఏరువాకా సాగారోరన్న..

  • నీ కష్టమంతా తీరునురోరైతన్నా.!!
  • ఏరువాక పౌర్ణమి రోజు ఎవుసం మొదలు
  • ‘మిరుగు’వోయి..’ఆరిద్ర’చ్చె..ఆనజాడ లేకపాయె

ఎట్టకేలకు ఏరువాక పున్నమినాడు ‘తొలకరి’ పలకరించింది..!
పుడమితల్లి పులకరించింది.!!ఈయేడు వానలు ఆశాజనకంగా ఉంటాయన్న వాతావరణ శాఖ శుభవార్త విన్న అన్నదాత కొత్త ఉత్సాహంతో పొలం బాట పట్టాడు.!
వానల జాడలేకున్నా..చెరువులు..కుంటల్లో నీళ్లు లేకున్నా..
ప్రాజెక్టుల్లో వరద నీరు ఎండిపోయినా ఎగిర్త పడకుండా ‘ఆనదేవుడి’మీద నమ్మకంతో రైతుల్లో కొత్త ఆశలు చిగురింపజేశాయి.
వర్షాలు అడపాదడపా కురిసినా బోరుబావుల్లో భూగర్భజలాలు ఆదుకుంటాయిలేనన్న ధీమా వారిని పొలం బాట పట్టించింది.
విత్తనాలు.. సాగు ఖర్చు.. తడిసి మోపెడైనా భరిద్దామనన్న భరోసాతో ‘ఏరువాక పౌర్ణమి’ని పురష్కరించుకుని దుక్కులు దున్నడం మొదలెట్టాడు.


నాగరికత ఎంతున్నా నాగలి పట్టుడే అన్నా..

నాగరికత ఎంతగా ముందుకు సాగినా.. నాగలి లేనిదే పని జరగదు. రైతు లేనిదే పూట గడవదు.అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగే ఏరువాక పౌర్ణమి. దీనినే ‘హలపౌర్ణమి’ అని కూడా అంటారు. ఇంతకీ ఈ ఏరువాక పౌర్ణమి విశిష్టత ఏమిటి. దాన్ని ఈ రోజునే ఎందుకు చేసుకుంటారు అంటే..!
వైశాఖ మాసం ముగిసి జ్యేష్ఠం మొదలైన తరువాత వర్షాలు కురవడం మొదలవుతాయి. ఒక వారం అటూ ఇటూ అయినా కూడా, జ్యేష్ఠ పౌర్ణమినాటికి తొలకరి పడక మానదు. భూమి మెత్తబడకా మానదు. అంటే నాగలితో సాగే వ్యవసాయపు పనులకు ఇది శుభారంభం అన్నమాట. అందుకనే ఈ రోజున ఏరువాక అంటే ‘దుక్కిని ప్రారంభించడం’ అనే పనిని ప్రారంభిస్తారు. అయితే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి వరకూ ఎందుకు ఆగడం. ఖాళీగా ఉంటే కాస్త ముందర నుంచే ఈ దుక్కిని దున్నేయవచ్చు కదా అన్న అనుమానం రావచ్చు. ఎవరికి తోచినట్లు వారు తీరికని బట్టి వ్యవసాయాన్ని సాగిస్తే ఫలితాలు తారుమారైపోతాయి. సమిష్టి కృషిగా సాగేందుకు, పరాగ సంపర్కం ద్వారా మొక్కలు ఫలదీకరణం చెందేందుకు, రుతువుకి అనుగుణంగా వ్యవసాయాన్ని సాగించేందుకు… ఇలా రకరకాల కారణాలతో ఒక వ్యవసాయిక కేలెండర్‌ను ఏర్పరిచారు పెద్దలు. అందులో భాగమే ఈ ఏరువాక పౌర్ణమి. కొంతమంది అత్యుత్సాహంతో ముందే పనిని ప్రారంభించకుండా, మరికొందరు బద్ధకించకుండా… ఈ రోజున ఈ పనిని చేపట్టక తప్పదు.

వ్యవసాయ పనిముట్ల శుభ్రం

పున్నమి నాడు వ్యవసాయ పనిముట్లు అన్నింటినీ కడిగి శుభ్రంచేసుకుంటారు రైతులు. వాటికి పసుపుకుంకుమలు అద్ది పూజించుకుంటారు. ఇక ఎద్దుల సంగతైతే చెప్పనక్కర్లేదు. వాటికి శుభ్రంగా స్నానం చేయించి, వాటి కొమ్ములకు రంగులు పూస్తారు. కాళ్లకు గజ్జలు కట్టి, పసుపుకుంకుమలతో అలంకరించి హారతులిస్తారు. పొంగలిని ప్రసాదంగా చేసి ఎద్దులకు తినిపిస్తారు. ఇక ఈ రోజున జరిగే తొలి దుక్కలో కొందరు, తాము కూడా కాడికి ఒక పక్కన ఉండి ఎద్దుతో సమానంగా నడుస్తారు. వ్యవసాయ జీవనంలో తమకు అండగా నిలిచి, కష్టసుఖాలను పాలుపంచుకునే ఆ మూగ జీవాల పట్ల ఇలా తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తారు. ఇక ఏరువాక సాగుతుండగా, అలుపు తెలియకుండా పాటలు పాడుకునే సంప్రదాయమూ ఉంది. అందుకనే ఏరువాక పాటలు, నాగలి పాటలకి మన జానపద సాహిత్యంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది.

సాగువాటు సంబురం

అన్నం పరబ్రహ్మ స్వరూపం.!
వెన్నముద్దవలె పిసికి పిసికి మన్నునుంచి అన్నం సృష్టించే బ్రహ్మ.. కర్షకుడు.!!
ఏరువాక పండుగు.
అంటే..ఎవుసాయపు ప్రారంభదినం.!
రైతు అనేది ‘ఉర్దూ’ మాట. మన మాట ‘కాపు’.కాపు అంటే పంటను కాపుగాసే సంరక్షకుడు అన్నట్టు.
కాపుగాసేది ఒక్క పంటనేనా.? ఊహూఁ కాదు,
ప్రకృతినీ,ప్రాణికోటినీ, తోటి మానవ సమూహాన్ని
సమస్తంగా కాపుగాస్తాడు. కర్షకుడు లోకరక్షకుడు.
గ్రీష్మ ఋతువు నడిఎండల్ల పారే గంగను మన దగ్గర
సత్యగంగ (ప్రశస్తమైన గోదావరి నదీప్రవాహం) అంటరు.
ఈ సత్యగంగలో ( గోదావరిలో) స్నానం పరమపవిత్రం.
గంగొడ్డు పల్లెల్ల కాపులు జాముపొద్దుకే గంగతానంజేసి,
నాగటిమీది ఎడ్లు.. రామలక్ష్మణులకూ తానంజేయించి,
కొమ్ములకు చమరు రాసి, మెడకు గజ్జెలపట్టెడ కట్టి,
నాగలికి & కాణికి సున్నంరాసి, పసుపుకుంకుమ పెట్టి,
దీపహారతులిచ్చి, కమ్మటి పరమాన్నమో, పప్పుభక్ష్యాలో
పాలకొడిసె ఆకులో వడ్డించి, తన బుద్ధితీరా తినిపించి,
ధాన్యం గంపతో ఉదయంపూటనే చేనుదగ్గరికి చేరుకుని,
చెట్టుచేమ నలీనట్రా ఏరిపారేసి, ఐదు దోసిళ్ల విత్తనం చల్లి,
నాగలి కట్టి, ఒక ఐదు చాళ్లో, ఐదు కోండ్రలో దున్నే పండుగ
మన కృషిసంస్కృతిల వ్యవసాయానికి తొలుత పండుగ !
ఇది చేనుకు మొలుక పండుగ, పంటకు మొదటి పండుగ !
ఏరు అంటే అరుక /నాగలి, వాక అంటే చాలు/ ప్రవాహం.
ఏరువాక అంటే నాగలికట్టి మొదటిచాలు వేసుడన్నట్టు.
దీన్నే మన దగ్గర.. సాగువాటు/ సాగుబాటు అంటరు.

ఇక్ష్వాకుల కాలం నుంచే.. ఏరువాక

ఇక్ష్యాకుల కాలంలోనే..మన ఖండగల్ల భూములకు
జేష్ట్యమాసపు సాగుబాటు పున్నమనాటి పుణ్యదినాన
రాజులు.. శతసహస్ర హలదానాలు చేసిన చరిత్ర ఉంది.!
శాతవాహనుల దానాలూ, ప్రోత్సాహకాలూ ఉన్నయి.
కాకతీయుల కాలంలో.. సాగుబాటు రోజున ఊరంతా
ఉమ్మడిగా ‘ఏరువాక గుబ్బలి’ దగ్గర ఉత్సవం చేసినట్టు
కరీంనగరు ప్రాంతంలనే.. రెండు శాసనాలు చెప్తున్నయి.
గుబ్బలి అంటే వ్యవసాయభూముల్ల ఉన్న.. చిన్నగుట్ట.
పంటలకు వానలు ఆధారం, వానలకు మబ్బులు మూలం.
మరి మన ఊర్ల.. మబ్బులను ఆపి నిలిపేవి గుట్టలేకదా.
ఏరువాక గుబ్భలి మన సమష్టి కృషికి.. గొప్పసంకేతం.!
గొలుసుకట్టు చెరువులకు మన తెలంగాణపు నేల–
ఒక ముందటి నాగలి.! పంటరాశి పోసిన ఒక తలవాకిలి.
ఇది అనాదిగా.. ‘పెద్దయ్య-చిన్నయ్య’ ఆహారసంస్కృతి.
తెలుగులో తొలుతొలుతగా అక్కడెక్కడనో బళ్ళారిల
మతప్రచార పత్రిక వస్తే,, నిజాం సంస్థానపు నడిగడ్డన
వచ్చిన మొట్టమొదటి తెలుగుపత్రిక — ‘సేద్యచంద్రిక’..!
ఇది ఒక వ్యవసాయ పత్రిక… ఇదీ మన గతచరితం..!

గెట్టు మీద నుంచే..’పనీ – పాట’

పొలంగెట్టు మీద, చెట్టునీడకు కూసొని పంటనుచూస్తూ
తన తీరికను, పాటగా మలుచుకునే.. జపాను దేశపు
రైతు నోటివెంట హైకూ కవిత్వం పుట్టిందనికదా చెప్తరు.
మరి, మన దగ్గర అటువంటిదేమీ లేదా.. అని అంటే,
ఎందుకులేదు.. దాని తాతకు, తాతమ్మ కవిత్వం ఉన్నది.
యాతం, రాటు, మోట, గూడ, కలుపు, కోత, ఎగవోత..
చెరుగుడు, దంచుడు, ఇసురుడు, వండుడు, పెట్టుడు..
శ్రమలోపల ప్రతి సందర్భానికి.. ఒకటీరెండూ కానేకాదు,
పదులూ వందలూ కాదు, వేలకువేలు… పాటలున్నయి.
కాపుకు..పెండ అంటే, అసిద్ధమెంతమాత్రమూ కాదు.
పంటకు మూలం పెంటే.. పంట-పెంట సూర్యచంద్రులు.
అందుకే ఒక కాపుదనపు శ్రమజీవి.. తన ఇష్టపూర్తిగ
పెండపిసికి పిడుకలు చేసుకుంటూ పాడుకునే.. పాట !
ఈ పాటలోపటికి తొంగిచూస్తే… ఒళ్లు పులకలేస్తది.!!

ఎత్తేదా ఈ పెండ ఎత్తేదా ఈ పెండ
ఎన్నాముద్దోలే.. ఎత్తేదా ఈ పెండ !
తొక్కేదా ఈ పెండ తొక్కేదా ఈ పెండ
తొడగదులాకుండ.. తొక్కేదా ఈ పెండ !
పిసికేదా ఈ పెండా పిసికేదా ఈ పెండా
పిడికిళ్లా నిండా.. పిసికేదా ఈ పెండా !
చేసేదా ఈ పెండ చేసేదా ఈ పెండ
చెండీ బంతోలే.. చేసేదా ఈ పెండ !
చరిసేదా ఈ పెండ చరిసేదా ఈ పెండ
చందమామోలే.. చరిసేదా ఈ పెండ !
చరిసేదా ఈ పెండ చరిసేదా ఈ పెండ
చందమామోలే.. చరిసేదా ఈ పెండ !…

ఇదీ.. మన శడ్రుచోపేత ఆహారం వెనుకున్న–
చందమామ వన్నె… శ్రమైక జీవనసంస్కృతి !

అట్లనే..ఇగో.! ఇది మన ఆడిబిడ్డ దీవెనార్తి.. చూడుండ్రి.

దారిలో జొన్నలా బండ్లో ! దారిలో జొన్నలా బండ్లో !
దారిలో జొన్నలా బండ్లో ! దారిలో జొన్నలా బండ్లో !
ఎన్నాళ్లకొచ్చినయి జొన్నలా బండ్లో ! /దారిలో/
జొన్నలా బండ్లవీ అన్నలా బండ్లో ! /దారిలో/
అన్నలా బండ్లకూ హారతియ్యాలే ! /దారిలో/
కోరికట్నామడిగి కొంగుజాపాలే ! / దారిలో/
దారిలో జొన్నలా బండ్లో ! దారిలో జొన్నలా బండ్లో !
దారిలో జొన్నలా బండ్లో ! దారిలో జొన్నలా బండ్లో !

అందుకే.. ఆడిబిడ్డకు పండిన పంటల భాగముంటది.
పంటరాశి మీది మొదటిగంపను ఆడిబిడ్డకు కొలుస్తరు.
ఈ ఆడిబిడ్డకు కొలిచిన తొలుతొలుత పంటగంపతోటి
ఉట్టి బట్టబాతలేకాదు, నగలునాణేలు మాత్రమేగాదు,
భూములుజాగలు కొనుక్కున్న… మన ఆడిబిడ్డలు
తెలంగాణ గడ్డమీద ఇప్పటికీ మనమధ్యన ఉన్నరు.
ఒకసారి వాళ్లతోటి మాటకలిపి, మనుసు కదిలిస్తే–
మన సాగువాటు పండుగకు వారు సజీవమై నిలుస్తరు…!!

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News