Thursday, January 22, 2026

ఐకెపి కొనుగోలు కేంద్రం దళారుల చేతుల్లోకి వెళ్లిందా?🔥 రైతులకు కాంటాలు కష్టమే… దళారులకు గంటల్లో లారీలు!🔥 మిల్లర్లతో కుమ్మక్కు… బస్తాలకు బేరం?🔥 నిర్వాహకులకు అండగా నిలిచిన అధికారులు ఎవరు?

నేటి సాక్షి మహబూబాబాద్ నర్సింహులపేట, (భూక్యా రవినాయక్ )డిసెంబర్ 27 మండలంలోని రామన్నగూడెం గ్రామంలో నిర్వహిస్తున్న ఐకెపి వడ్ల కొనుగోలు కేంద్రం రైతులకు భరోసా కల్పించాల్సిన స్థానంలో దళారుల దందాకు వేదికగా మారిందన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా వడ్లు కొనుగోలు చేసి, మధ్యవర్తుల పాత్రను తొలగించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం ప్రస్తుతం అదే మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్లిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.కొనుగోలు కేంద్రానికి వడ్లు తీసుకొచ్చిన రైతులు కాంటాలు వేయించుకోవడానికి, లారీలకు ఎత్తించడానికి రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తుండగా, దళారుల వడ్లకు మాత్రం ఎలాంటి ఆలస్యం లేకుండా వెంటనే కాంటాలు వేసి లారీల్లో ఎత్తి తరలిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రక్రియలో ఒక్కో బస్తాకు రూ.10 నుంచి రూ.30 వరకు ఒప్పందాలు కుదుర్చుకుని ఇప్పటికే మూడు లారీల మేర వడ్లను అక్రమంగా తరలించినట్లు సమాచారం.శుక్రవారం సాయంత్రం దళారులు రహస్యంగా కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన వడ్లను శనివారం చివరిదశలో కాంటాలు వేసి తరలించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై రైతులు ప్రశ్నించగా, నిర్వాహకులు మరియు దళారులు “వద్దు అనుకుంటే వడ్లు పోసుకోవద్దు” అన్నట్టుగా మాట్లాడారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, వారు స్పష్టమైన చర్యలు తీసుకోకుండా నిర్వాహకులను వెనకేసుకొచ్చిన తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది.ఇంకా, మిల్లర్లతో కుమ్మక్కై గ్రామ రైతుల పేర్లపై ఆన్‌లైన్ ఎంట్రీలు చేసి, వాస్తవానికి దళారుల వడ్లను తరలిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. బస్తాలు కూడా వేయకుండా వడ్లు పంపించి మిల్లర్ల నుంచి ముడుపులు తీసుకుంటూ ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం కలిగిస్తున్నారని మండల ప్రజలు మండిపడుతున్నారు. ఈ అక్రమాలు మండల స్థాయి అధికారుల దృష్టికి వచ్చినప్పటికీ, చూసిచూడనట్లుగా వదిలేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు వెంటనే స్పందించి ఐకెపి నిర్వాహకులు, సంబంధిత అధికారుల పాత్రపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరిస్తున్నారు.ఈ విషయంపై ఏపిఎం రాములు స్పందిస్తూ, నరసింహపురం గ్రామానికి చెందిన శీను అనే వ్యక్తి 200 బస్తాలను కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన విషయం గుర్తించినట్లు తెలిపారు. అవి ప్రైవేటు వ్యక్తుల వడ్లుగా నిర్ధారణ కావడంతో వెంటనే తిరిగి పంపించినట్లు చెప్పారు. భవిష్యత్తులో కొనుగోలు కేంద్రంలో ప్రైవేటు వ్యక్తుల వడ్లు పోసినట్లు తెలిసినట్లయితే జిల్లా అధికారులకు తెలియజేసి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News