‘నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 09 ~అన్నమయ్య జిల్లా :-: ‘ఒక దేశం – ఒకేసారి ఎన్నికలు’ లక్ష్యంతో దేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ప్రవేశపెడుతున్న బిల్లులకు రాష్ట్రాల శాసనసభల ఆమోదం అవసరం లేదని లా కమిషన్ సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి తెలిపింది. ప్రతిపాదిత బిల్లులు రాజ్యాంగంలోని మౌలిక స్వరూపాన్ని మార్చేందుకు ఏమీ ప్రయత్నించడం లేదని పేర్కొంది. సమాఖ్య నిర్మాణానికి రాజ్యాంగ నిబంధనలను మార్చడం లేదని స్పష్టం చేసింది. ఈ బిల్లులకు సంబంధించి ఇప్పటికే పలు వర్గాలతో చర్చించిన జేపీసీ లా కమిషన్‌తో కూడా విస్తృత చర్చలు జరిపింది. మరో రెండు నెలల్లో మరింత మంది నిపుణులు, సంస్థలతో చర్చలు జరిపిన తర్వాత నివేదికను రూపొందించి వచ్చే బడ్జెట్ సమావేశాలలోపు సమర్పించనుంది. ఈ నివేదికను బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. కాగా రాజ్యాంగంలోని 368వ అధికరణ కింద జమిలి ఎన్నికల నిర్వహణకు రాష్ట్రాల ఆమోదం అవసరం లేదని 23వ లా కమిషన్ చైర్మన్ జస్టిస్ దినేశ్ మహేశ్వరి జేపీసీ సభ్యులకు వివరించారు..~~~~~~~~~~~~~~~~~





