నేటి సాక్షి – జగిత్యాల బ్యూరో*( రాధారపు నర్సయ్య )మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని బుధవారం జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు (లోకల్ బాడీస్), ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో మ్యాపింగ్, ఓటర్ల జాబితా తయారీ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు వంటి అంశాలపై సమగ్ర సమీక్ష చేశారు.*ఖచ్చితమైన ఓటర్ల జాబితా అత్యంత కీలకం*మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో రెండవ సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి వార్డు వారీగా, పోలింగ్ స్టేషన్ వారీగా ఫోటో ఓటర్ల జాబితాల తయారీపై కమిషన్ సూచనలు అందించింది. ఖచ్చితమైన ఓటర్ల జాబితాల తయారీ ఎంతో ముఖ్యమని, నిర్దేశిత మార్గదర్శకాలు, కాలపట్టికలను కచ్చితంగా పాటించాలని ఆమె అధికారులను ఆదేశించారు.*కొత్త ఓటర్ల చేర్పు – అనర్హుల తొలగింపు*అర్హులైన కొత్త ఓటర్ల చేర్పుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. డూప్లికేట్ మరియు అనర్హులైన ఓటర్ల పేర్ల తొలగింపుపై చర్చించి తగిన సూచనలు అందించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను కచ్చితంగా పాటించాలని కమిషనర్ స్పష్టం చేశారు.*పోలింగ్ కేంద్రాల పునర్వ్యవస్థీకరణ సూచనలు*తాజా ఓటరు డేటాను వినియోగించి అవసరమైన చోట్ల పోలింగ్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ చేయాలని కమిషన్ సూచించింది. ఫిర్యాదుల పరిష్కార విధానం, అవగాహన కార్యక్రమాల నిర్వహణ, చట్టబద్ధ ఫారమ్‌లు ప్రజలకు అందుబాటులో ఉంచడం వంటి అంశాలను వివరించారు. ఎలాంటి లోపాలు జరగకుండా జాగ్రత్త వహించాలని జిల్లా అధికారులను హెచ్చరించారు.*ముఖ్యమైన తేదీలు ప్రకటింపు*12-01-2026: సవరించబడిన తెలంగాణ పురపాలక చట్టం–2019లోని సెక్షన్ 195-ఎ ప్రకారం వార్డు వారీగా ఫోటో ఓటర్ల జాబితాల ప్రచురణ13-01-2026: పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా ప్రచురణ, Te-Pollలో అప్లోడ్16-01-2026: కలెక్టర్ కార్యాలయాలు, మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో తుది పోలింగ్ కేంద్రాల జాబితా, పోలింగ్ కేంద్రాల వారీగా ఫోటో ఓటర్ల జాబితాల ప్రచురణ*జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ స్పందన*జగిత్యాల కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజగౌడ్ కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు సంబంధించి వచ్చిన 229 అభ్యంతరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమాధానాలు ఇవ్వాలని సంబంధిత అధికారులకు సూచించారు. నామినేషన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాల ఏర్పాటులో తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.*ఎన్నికల ఏర్పాట్లపై దృష్టి*పోలింగ్ సిబ్బంది, ఆర్వోల నియామకం, శిక్షణ, డిస్ట్రిబ్యూషన్ మరియు రిసెప్షన్ సెంటర్ల ఏర్పాటు, కౌంటింగ్ కేంద్రాల గుర్తింపు, మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లు, ఎన్నికల సంక్షిప్త నిబంధనల అమలు, ఓటర్ల అవగాహన కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా నోడల్ అధికారులు, ప్రత్యేక అధికారులు తమకు కేటాయించిన విధులను పూర్తి స్థాయిలో నిర్వహించాలని సూచించారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి ఆర్డీవోలు మధుసూదన్, జీవాకర్ రెడ్డి, శ్రీనివాస్,జెడ్పీ సీఈవో గౌతమ్ రెడ్డి, డిప్యూటీ సీఈవో పి. నరేష్,డిపివో మదన్ మోహన్, జిల్లా నోడల్ అధికారులు,జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు._____

