నేటి సాక్షి పత్రిక పాత్రికేయులు శర్మ, అన్నమయ్య జిల్లా, డిసెంబర్ 08 ~అన్నమయ్య జిల్లా :-: ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డులున్నవారికి ఈ నెల కూడా నిరాశ తప్పలేదు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో ఈ నెల కూడా కందిపప్పు అందుబాటులోకి రాలేదు. కొన్ని నెలలుగా ప్రజలు కందిపప్పు కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి నెలలా కందిపప్పు వస్తుందని భావించినా చివరికి నిరాశే తప్పడం లేదు. డిసెంబర్‌లో లేకపోయినా పెద్ద పండగయిన సంక్రాంతి నాటికైనా కందిపప్పును అందుబాటులోకి వస్తుందా రాదా అనే ప్రశ్నలు తెరమీదకొస్తున్నాయి. మార్కెట్‌లో కందిపప్పు ధర ఆకాశానికి అంటుకుంటా ఉందని తమకు ఆర్థిక భారం పడుతోందని రేషన్‌కార్డులు ఉన్నవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో 2014 – 2019 మధ్య టీడీపీ పాలనలో, ప్రజలకు అవసరమైన అనేక రకాల వస్తువులను రేషన్ ద్వారా అందించేవారు. బియ్యం, పంచదారతో పాటు కందిపప్పు, వంటనూనె, చింతపండు, సబ్బులు, రాగి పిండి వంటివి కూడా సరఫరా చేసేవారు. ఇది ప్రజల జీవితాలను సులభతరం చేసింది. కానీ ప్రస్తుత ప్రభుత్వం కొన్ని రకాల సరుకులను అరకొరగా మాత్రమే అందిస్తోంది. ప్రస్తుతం, రేషన్ దుకాణాల్లో కందిపప్పు సరఫరా సరిగా లేకపోవడంతో చాలా కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. రేషన్ లో వచ్చే కందిపప్పుపై ఆధారపడేవాళ్లు బయట మార్కెట్ లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చౌక దుకాణాల్లో కేజీ కందిపప్పు ధర రూ.60 లోపే ఉంటుంది. కానీ బయట మార్కెట్ లో దీని ధర రూ.150 నుండి రూ. 200 వరకు పలుకుతోంది. ఈ వ్యత్యాసం వల్ల అంతకంత పేద, మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పడుతోంది. ప్రతి నెలా కందిపప్పు అడిగి రేషన్ డీలర్లు లేదని చెప్పడంతో నిరాశగా వెళ్తున్నారు. ఈ కందిపప్పు సరఫరా సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చాలా కాలంగా ఇలాగే నడుస్తా ఉందని సామాన్య ప్రజలు మండిపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కందిపప్పును సరఫరా చేసే కాంట్రాక్టర్ ను ఎంపిక చేసే ప్రక్రియలో ప్రభుత్వం త్వరగా చర్యలు చేపట్టి సరైన కాంట్రాక్టర్ దొరికితే, రేషన్ దుకాణాల్లో కందిపప్పు సరఫరా మెరుగుపడుతుందని ఆశిస్తున్నారు. మరి ఏపీ ప్రభుత్వం సంక్రాంతి నాటికైనా కందిపప్పును రేషన్ షాపుల్లోకి అందుబాటులోకి తెస్తుందా లేదా అన్నది చూడాలి.~~~~~~~~~~~~~~~~~~





