నేటి సాక్షి – కథలాపూర్ (రాధారపు నర్సయ్య)*కథలాపూర్ మండలంలో అక్రమ ఇసుక రవాణా రోజురోజుకీ పెరుగుతూ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. బొమ్మెన, తక్కలపల్లి, సిరికొండ, తాండ్రియాల, గంభీర్ పూర్ గ్రామాల పరిసరాల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఇసుక తవ్వకాలు, రవాణా కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉదయం నుండి రాత్రి వరకు ట్రాక్టర్లతో ఇసుకను డంప్ చేసి, రాత్రి వేళల్లో లారీలు, టిప్పర్ల ద్వారా ఇతర పట్టణాలకు తరలిస్తున్న దృశ్యాలు నిత్యకృత్యంగా మారిపోయాయని చెబుతున్నారు.*అధికారులపై ఆరోపణలు.!*ఈ అక్రమ రవాణా మొత్తం మండల స్థాయి అధికారుల కనుసైగలతోనే జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్ఐ సూచనల మేరకే ఈ వ్యవహారం నడుస్తోందని ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయం కూడా దీనిపై స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.*వసూళ్ల ఆరోపణలు వెల్లడి*అక్రమ రవాణాతో పాటు భారీగా వసూళ్లు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. బొమ్మెన గ్రామంలో రిపేర్ కోసం ఆగిన ఒక లారీ నుంచి రూ.50,000 వసూలు చేసిన ఘటన, జేసీబీ యంత్రాలపై కూడా డబ్బులు తీసుకున్నట్లు సమాచారం బయటపడింది. పట్టుబడిన ఇసుక డంపులపై డీడీలు కట్టించుకుని, అదే మొత్తాన్ని మళ్లీ డబుల్‌గా వసూలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు.*మాఫియా పద్ధతిలో కార్యకలాపాలు*కొంతమంది ఇసుక దళారులు పగటి పూట రహస్య ప్రదేశాల్లో ఇసుక నిల్వ ఉంచి, రాత్రివేళల్లో లారీల ద్వారా జగిత్యాల, ఆర్మూర్, నిజామాబాద్ ప్రాంతాలకు తరలిస్తూ భారీగా లాభాలు పొందుతున్నారని సమాచారం. అధికారుల పర్యవేక్షణలోనే ఈ అక్రమ రవాణా జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.*మైనింగ్ ఆదాయానికి భారీ నష్టం*ఇలా అక్రమంగా ఇసుక తరలింపులు కొనసాగడం వల్ల ప్రభుత్వ మైనింగ్ ఆదాయానికి భారీగా గండి పడుతోందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రోజువారీగా జరుగుతున్న ఈ అక్రమ కార్యకలాపాలను అరికట్టడంలో అధికారులు విఫలమవుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.*కఠిన చర్యల కోసం డిమాండ్*ఇకపై ఇలాంటి అక్రమ రవాణాలను పూర్తిగా అరికట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే భవిష్యత్తులో త్రాగునీరు, సాగునీటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మండలంలో జరుగుతున్న ఈ అక్రమ వ్యవహారాలపై ఉన్నతాధికారులు వెంటనే దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.__________





