నేటి సాక్షి – కథలాపూర్*( రాధారపు నర్సయ్య )వేములవాడ నియోజకవర్గంలోని కథలాపూర్ మండల పరిధిలో గిరిజన గ్రామాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. పలు అన్‌కనెక్టెడ్ ఎస్టీ తండాలకు బీటీ రోడ్ల నిర్మాణం కోసం ట్రైబల్ వెల్ఫేర్ నిధుల నుంచి మొత్తం రూ.7 కోట్ల 80 లక్షలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కథలాపూర్ మండలం ఇప్పపల్లి గ్రామంలో బీటీ రోడ్డు నుంచి తండా వరకు రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్లు, భూషణ్రావుపేటలో కోనాపూర్ మెయిన్ రోడ్డునుంచి వాసం గుట్ట వరకు రోడ్డు నిర్మాణానికి రూ.1 కోటి 20 లక్షలు, భూషణ్రావుపేట మెయిన్ రోడ్డులోని కచూరాల బాట నుంచి చింతకుంట రాజారాం తండా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.3 కోట్ల 60 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధుల మంజూరుతో గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపడి, రవాణా సౌకర్యాలు మరింత సులభమవుతాయని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.*ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రయత్నాలకు ఫలితం*ఇటీవల కథలాపూర్ మండల పరిధిలోని గిరిజన తండాలకు రోడ్డు సౌకర్యాలు కల్పించాల్సిందిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌లను కోరారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వెంటనే నిధులు విడుదల చేసింది. గిరిజన ప్రాంతాల అభివృద్ధి తమ తొలి ప్రాధాన్యతగా ఉంటుందని, రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల విస్తరణకు కృషి కొనసాగుతుందన్నారు. కథలాపూర్ మండలానికి ఇంత భారీగా నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు ఆది శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు.*మరణించిన కుటుంబాలను పరామర్శించి ధైర్యం నింపిన ఆది శ్రీనివాస్*మరోవైపు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇటీవల కథలాపూర్ మండలంలోని పలు గ్రామాలను సందర్శించి మరణించిన వారి కుటుంబాలను పరామర్శించారు. చింతకుంట గ్రామానికి చెందిన మురళి గల్ఫ్‌లో ఇటీవల మరణించగా, అతని కుటుంబ సభ్యులను కలిసి ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. కథలాపూర్ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు మామగారైన దయ్యనడిపి గంగారాం, కోనాపూర్ గ్రామ వాసి, రాష్ట్ర మార్క్‌ఫెడ్ మాజీ చైర్మన్ లోక బాపు రెడ్డి తల్లివారి కుటుంబాలను పరామర్శించి వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. బొమ్మెనా గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మురళి మరణంపై కూడా ఆయన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో మండల్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాయితి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండి అజీమ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పుండ్రా నారాయణరెడ్డి, వైస్ చైర్మన్ పులి శిరీష హరిప్రసాద్, మున్నూరు కాపు జిల్లా అధ్యక్షుడు చెదలు సత్యనారాయణ, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు న్యావానంది శేఖర్‌తో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.—

