– బండి సంజయ్‌కు అభినందనల వెల్లువ
నేటి సాక్షి, కరీంనగర్: కరీంనగర్ ఎంపీగా భారీ మెజారిటీతో గెలుపొందిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ను కలిసి అభినందించేందుకు బుధవారం ప్రజలు, కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున తరలివచ్చారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలతో ఎంపీ కార్యాలయం సందడిగా మారింది. ఉదయం నుంచే జన జాతర మొదలైంది. పొద్దున్నే సంజయ్ నివాసం వద్దకు భారీగా జనం తరలివచ్చారు. అక్కడి నుంచి ఎంపీ కార్యాలయానికి వచ్చిన బండి సంజయ్‌ను మధ్యాహ్నం వరకు విరామం లేకుండా ప్రజలు, నాయకులు కలిసి శాలువా కప్పి, పూల బొకేలు అందించి అభినందనలు తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి సైతం రాష్ట్ర నాయకులు తరలివచ్చి సంజయ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి, బీజేపీ మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుగు అఫ్సర్ పాషా, జనగాం జిల్లా అధ్యక్షుడు దశమంత్ రెడ్డితోపాటు రిటైర్డ్ ఉద్యోగుల సంఘం, ఎల్ఐసీ ఏజెంట్ల సంఘం, యాదవ, గౌడ, మున్నూరుకాపు, దళిత, బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి సంజయ్ ను కలిసి అభినందనలు తెలిపారు. సంజయ్ తో కలిసి ఫోటోలు దిగారు. జనం తాకిడితో ఎంపీ కార్యాలయం జాతరను తలపించింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎంపీ కార్యాలయంలోనే ఉన్న బండి సంజయ్ సాయంత్రం హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు.