నేటిసాక్షి, మిర్యాలగూడ : నియోజకవర్గ పరిధిలోని దామరచర్ల మండలం బొత్తలపాలెం గ్రామ శివారులోనున్న నందిబోడు పైన కాకతీయుల కాలం (క్రీ.శ.13వ శతాబ్దం) నాటి శిధిల శివాలయం, భిన్నమైన శివలింగం, నంది, చెన్నకేశవ శిల్పాలను కాపాడుకోవాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవో, డా. ఈమని శివనాగిరెడ్డి అన్నారు. గ్రామ సర్పంచ్ ఇంజం నర్సిరెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు, వారి ఆధ్వర్యంలో ఆయన శనివారం నందిబోడ్ పైనున్న శిల్పాలను గ్రామస్తుల సమక్షంలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శివాలయంలో చెట్లు, పుట్టలు పెరిగి, గోడలు పడిపోయాయని, ఆలయ వెనకవైపు నిర్మించిన తాత్కాలిక రేకు షెడ్డు కింద కాకతీయుల శైలి ఉట్టిపడుతున్న శివలింగం పానపట్టము, ముట్టె, చెవులు భిన్నమైన నంది, తల, కాళ్లు లేని అందంగా అలంకరించిన శ్రీదేవి, భూదేవి సహిత చెన్నకేశవ విగ్రహాలు క్రీ.శ. 700 సంవత్సరాల నాటి బొత్తలపాలెం గ్రామ చరిత్రకు ఆనవాళ్ళని, వాటిని కాపాడుకొని, భవిష్యత్తరాలు అందించాలని శివనాగిరెడ్డి గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నర్సింగ్ అనిల్, గ్రామ పెద్దలు పగిడిపాటి శ్రీనివాస్ రెడ్డి, వీరారెడ్డి, రవీందర్ రెడ్డి, కందుల బిక్షారెడ్డి, పలసాని రామ్ రెడ్డి, పోటుపల్లి బాబు, ఉదయ్, సిరసాల సైదులు, నామా రవీందర్, ఆకారపు గోపాల్, మునగాల వెంకటరెడ్డి, ఇంకా శిల్పి బి. వెంకటరెడ్డి, పింగళి వెంకట నాగప్రసాద్ పాల్గొన్నారని శివనాగిరెడ్డి చెప్పారు.





