•డాక్టర్ నిర్లక్ష్యానికి బాలింత మృతి..
- సరైన వైద్యం అందక మగ బిడ్డకు జన్మనిచ్చి మృతి చెందిన తల్లి
- హాస్పిటల్ వద్ద ఆందోళనకు దిగిన బంధుమిత్రులు
నేటి సాక్షి కోదాడ ప్రతినిధి:
డాక్టర్ నిర్లక్ష్యానికి సరైన వైద్యం అందక పట్టణానికి చెందిన ఓ బాలింత మృతి చెందిన ఘటన కోదాడ పట్టణంలోని శ్రీ తిరుమల ప్రైవేట్ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. బంధుమిత్రులు తెలిపిన వివరాల ప్రకారం… కోదాడ పట్టణానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు రాయపూడి వెంకటనారాయణ కుమార్తె హిమబిందు ను నల్గొండకు చెందిన వ్యక్తి కి వివాహం చేశారు. హిమబిందు మొదటి కాన్పు కోదాడలోని తిరుమల ఆసుపత్రిలో జరగడంతో, రెండో కాన్పు కోసం కూడా ఆమెను తిరుమల హాస్పిటల్ కు శనివారం అడ్మిట్ చేశారు. అదే రోజు సాయంత్రం ఐసీయూలో నార్మల్ డెలివరీ చేయడంతో మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఐసీయూలో ఉన్న హిమబిందును బయటకు తీసుకొనిరాకుండా ఉంచడంతో కుటుంబ సభ్యులు చూపించాలని పట్టుబడ్డారు. కొద్దిసేపటి తర్వాత చూపిస్తాం వైద్యం నడుస్తుందంటూ హైడ్రామా మొదలుపెట్టారు. కొద్దిసేపటి తర్వాత వైద్యులు మృతి చెందినట్లుగా తెలపడంతో బంధువులు ఆగ్రహించి అసలేం జరిగిందని,ఆసుపత్రి వైద్యులను,సిబ్బందిని నిలదీశారు. నార్మల్ డెలివరీ అయిన తర్వాత బాబుకు జన్మనిచ్చి ఎలా చనిపోయిందంటూ ఆసుపత్రి వారిని అడిగిన సమాధానం చెప్పలేదు. కుటుంబ సభ్యులు ఆపరేషన్ చేయాలని కోరినప్పటికీ పట్టించుకోకుండా ఉదయం ఐదు గంటలకు అడ్మిట్ అయిన గర్భిణీ హిమబిందు సాయంత్రం వరకు ఉంచి నార్మల్ డెలివరీ కోసం ఉంచారని, దీంతో డెలివరీ అయినప్పుడు తీవ్ర రక్తస్రావమై చనిపోయిందని బంధువుల ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే చనిపోయిందని వారు ఆందోళన దిగారు…