నేటి సాక్షి – లక్షెట్టిపేట(రేగుంట ప్రసాద్)ప్రత్యేక కథనం :ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టాలంటే బాబోయ్ కుక్కలు అంటూ లక్షెట్టిపేట మండలం కొమ్ముగూడెం గ్రామంలో నివసిస్తున్న స్థానికులు బెంబేలెత్తుతున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా. ఎక్కడ పడితే అక్కడ కాలనీ వీధుల్లో గుంపులుగా సంచరిస్తున్న కుక్కలు వచ్చే పోయే వారిపై దాడులు చేయడంతో గ్రామంలో నివసిస్తున్న స్థానికులు, చిన్నారులు, వృద్ధులు, భయాందోళనలకు గురవుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఏ రోడ్లో చూసినా కుక్కలు గుంపు కనబడుతున్నాయి. ఒంటిరిగా బయటకు వెళ్లాలంటేనే గ్రామనివాసులు జంకుతున్నారు. గతంలో పంచాయతీ సిబ్బంది కుక్కల్ని పట్టడానికి వచ్చామని హడావుడి చేశారు గాని ఒక దాన్ని కూడా పట్టుకో లేదని వాపోతున్నారు. పంచాయతీ అధికారులకు, ప్రజా ప్రతినిధు లకు ఎన్నిసార్లు చెప్పినా, తమ గోడు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు కాలనీల్లో గుంపులు, గుంపులుగా ఉన్న కుక్కలను లెక్కిస్తే 100కి పైగానే ఉంటాయని వారు అంటున్నారు. ఉదయం వేళ స్కూల్ బస్సు, ఆటో కోసం విద్యార్థులు వేచి ఉంటున్న సందర్భంలో కుక్కల గుంపును చూసిన విద్యార్థులు భయపడుతున్నారు. కుక్కల దాడి నుంచి తప్పించుకోవడానికి వేగం పెంచి,వాహనాదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. కాలనీ నుంచి ఇంటీకి వెళ్లే దారిలో సోమవారం రాత్రి పది కుక్కలున్న గుంపు ఓ ద్విచక్రవాహన చోదకుడి పైకి వచ్చాయి. చాకచక్యంగా అతడు తప్పించుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు. ఇంట్లో ఉన్న తినుబండరాలు, నిత్యవసర సరుకులు, వస్తువులను ఎత్తుకెళ్లడంతోపాటు, గుంపులుగా సంచరిస్తూ ఇంటిదగ్గర పెంచుకుంటున్న కోళ్లు, మూగ జీవాలను ఎంచక్కా తినేస్తూ స్థానికులపై దాడులకు దిగుతూ గాయపరుస్తున్నాయి. కుక్కల నియంత్రణలో అధికారులు అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని గుంపులుగా రోడ్డుపై తిరుగుతూ చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు, సైకిల్, ద్విచక్రవాహనదారులు, పాదచారులపై ఎగబడి కరుస్తున్నా.. యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. వీధికుక్కల స్వైర విహారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసిన అధికారులు ఎవరూ స్పందించకపోవడంతో రహదారుల వెంబటి వెళ్లాలంటే భయంతో వెళ్లాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కల నివారణకు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. కుక్కల బెడద నుంచి రక్షించాలని స్థానికులు కోరుతున్నారు. కుక్కలు గుంపులు, గుంపులుగా స్వైరవిహారం చేస్తూ విచ్చలవిడిగా దాడి చేస్తున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. పుస్తకాల బ్యాగులతో స్కూళ్లకు నడుచుకుంటూ వెళుతున్న విద్యార్థుల వెంటపడి కరుస్తున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. కుక్కల భయానికి ఇంటి నుండి చిన్నారులను, వృద్ధులను బయటకు పంపలేక, కర్ర సహాయంతో తప్ప బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి సమన్వయంతో కుక్కల బెడదపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, వాటిని అరికట్టాలని గ్రామ ప్రజలు అధికారు లను డిమాండ్ చేస్తున్నారు.





