నేటి సాక్షి, ఎండపల్లి:* నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని కుమ్మెరలో జరిగిన మల్లన్న జాతర విషాద ఘటన రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. ఈ ఘటనపై దళిత సంఘం సీనియర్ నేత రామగిరి మల్లేష్ తీవ్రంగా స్పందించారు. రజక కుటుంబానికి చెందిన చిలికేశ్వరం గణేష్–మౌనిక దంపతులు తమ రెండు నెలల చిన్నారితో కలిసి జాతర, దైవ దర్శనానికి రాగా అక్కడున్న అగ్రకులానికి చెందిన నిర్వాహకులు కులం పేరుతో వారిని అడ్డుకుని దాడికి పాల్పడినట్లు ఆరోపించారు. ఈ క్రమంలో పసి పాపను కాలితో తన్నడంతో తీవ్ర గాయాలపాలైన చిన్నారి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం అత్యంత దారుణమని మల్లేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒక కుటుంబంపై దాడి కాదు, రాజ్యాంగ విలువలపై దాడి. కుల వివక్ష ఇంకా సమాజంలో బలంగా ఉన్నదనడానికి ఇది నిదర్శనం. నిరపరాధ చిన్నారి ప్రాణం తీసిన ఈ ఘటన మానవత్వానికే మచ్చ అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద కేసు నమోదు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి తగిన పరిహారం, ఒక కుటుంబ సభ్యునికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు దళిత సంఘం తరపున పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు.





