- కాలువలో మునిగి తండ్రి దుర్మరణం
- కరీంనగర్లో విషాదం
నేటి సాక్షి, కరీంనగర్: నీటి కాలువలో పడ్డ తన పిల్లలను కాపాడబోయి ఓ తండ్రి దుర్మరణం చెందాడు. ఈ ఘటన సోమవారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌లో జరిగింది. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సంతోష్‌నగర్‌లో ఉంటున్న బంగారి విజయ్ (47) కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని పేఅండ్అకౌండ్స్ ఆఫీసులో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆది, సోమవారం సెలవు కావడంతో భార్య ప్రశాంతి, కూతురు సాయినిత్య, కొడుకు విక్రాంత్, అత్తతో కలిసి హుస్నాబాద్ మండలం పొట్లపల్లిలోని శివాలయాన్ని దర్శించుకొని, కరీంనగర్ వస్తున్నారు. ఈ క్రమంలో ఎల్ఎండీ రిజర్వాయర్ వద్ద సరదాగా గడిపేందుకు కొద్దీసేపు ఆగారు. కాకతీయ కాలువ హెడ్ రెగ్యులేటర్ గేట్ల వద్ద ఫొటో దిగుతుండగా, సాయినిత్య ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయింది. వెంటనే కూతురును కాపాడేందుకు విజయ్ నీళ్లలో దూకాడు. ఆ వెంటనే కొడుకు విక్రాంత్ కూడా వారిని కాపాడేందుకు నీళ్లలో దూకాడు. విజయ్ భార్య ప్రశాంతి, అత్త కేకలు వేయడంతో సమీపంలో ఉన్న జాలరీ శంకర్ కాలువలో దూకి పిల్లలిద్దరినీ కాపాడాడు. విజయ్ నీళ్లలో మునిగి దుర్మరణం చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. విషయం తెలుసుకున్న మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. పిల్లలను కాపాడిన శంకర్‌ను అభినందించారు.