నేటి సాక్షి గజ్వేల్…గజ్వేల్ పట్టణంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అన్నం, పాలకూర పప్పు, వంకాయ–ఆలుగడ్డ–టమాటా కూరలను స్వయంగా తనిఖీ చేసి నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. పిల్లలకు భోజనం నెయ్యితో వండించాలని వంట సిబ్బందిని ఆదేశించారు.స్టాక్ రిజిస్టర్ను పరిశీలించిన కలెక్టర్, సరుకులు అందిన వెంటనే నమోదు చేయాలని, ఒకేసారి రాస్తానని నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరించారు. కామన్ డైట్ మెనూను తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థుల హాజరు ప్రకారం అందరికీ సరిపోయేలా రుచికరమైన ఆహారం వండాలని సూచించారు. పిల్లలు కూర్చున్న చోటికే వెళ్లి మరల అన్నం, కూరలు వడ్డించాలని వంట సిబ్బందికి స్పష్టం చేశారు.విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడిన కలెక్టర్, ఆహారం బాగా నమిలి తినాలని, తినేటప్పుడు మాట్లాడకూడదని, ఒక్క మెతుకు కూడా వృథా చేయకూడదని సూచించారు. సరిపడా ఆహారం తీసుకుంటేనే శారీరకంగా దృఢంగా ఉంటారని, చదువుతో పాటు ఆటలు కూడా తప్పనిసరిగా ఆడాలని తెలిపారు.పిల్లల భోజనం, వసతి, విద్య విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, క్రమశిక్షణతో పాటు మంచి విలువలు అలవర్చాలని ప్రిన్సిపల్, ఉపాధ్యాయులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.





