నేటి సాక్షి గజ్వేల్ :—-కాంగ్రెస్ ప్రభుత్వ కక్ష్యపూరిత రాజకీయాలతో తెలంగాణ సమాజం భగ్గుమంటోందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై కాంగ్రెస్ సర్కార్ చేపడుతున్న రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీతో పట్టణం దద్దరిల్లింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీఆర్ఎస్ కార్యదర్శి వేలేటి రాధాకృష్ణ శర్మ, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్‌తో పాటు 20 వార్డుల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాధాకృష్ణ శర్మ మాట్లాడుతూ… ప్రజల్లో పెరుగుతున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అసమర్థ పాలనను కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్‌పై రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌ను ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండంలా మారుతుందని, ఈ రోజు జరిగిన బైక్ ర్యాలీనే కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరిక అని అన్నారు.ఎన్నికల సమయంలో 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు గడిచినా ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయలేదని ఆరోపించారు. పాలన చేతగాక ప్రజల దృష్టిని మళ్లించేందుకు “డైవర్షన్ గేమ్స్” ఆడుతోందని, అందులో భాగంగానే తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్‌పై సిట్ నోటీసులు, అక్రమ కేసులతో వేధింపులు ప్రారంభించిందని మండిపడ్డారు.చట్టంపై గౌరవంతోనే కేసీఆర్ ఈ రోజు విచారణకు హాజరయ్యారని స్పష్టం చేసిన ఆయన… కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై పెట్టిన చెల్లని కేసులతో బీఆర్ఎస్‌ను ఏమి చేయలేరని తేల్చిచెప్పారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగేది లేదని, కేసీఆర్ ముద్ర చెరిగేది కాదని, చివరికి న్యాయమే గెలుస్తుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం భూస్థాపితం కావడం ఖాయమని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు నవాజ్ మీరా, నర్సింగరావు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





